మండలి అపోజిషన్ లీడర్ పోస్ట్ మీద బొత్స టార్గెట్ ?
ఒక దశలో సీఎం పోస్టుకి రేసులో ముందు వరసకు వచ్చిన బొత్స ఒక ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయడమేంటి అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 4 Aug 2024 3:01 AM GMTఉత్తరాంధ్రాలో సీనియర్ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ జాతకం మార్చే ఎన్నికలుగా విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను అంతా చూస్తున్నారు. బొత్స సీనియారిటీ బట్టి చూస్తే ఆయన ఈ పదవికి పోటీ చేయకూడదు, ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్యే గా పలు సార్లు గెలిచారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్ గా కూడా ఉమ్మడి ఏపీకి సేవలు అందించారు. ఒక దశలో సీఎం పోస్టుకి రేసులో ముందు వరసకు వచ్చిన బొత్స ఒక ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయడమేంటి అన్న చర్చ సాగుతోంది.
అయితే ఇదంతా బొత్స వ్యూహం ప్రకారమే చేస్తున్నారు అని అంటున్నారు. మూడున్నరేళ్ళ పాటు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. అయిదేళ్ల పాటు ఏ పదవీ లేకుండా ఉండడం కంటే పెద్దల సభలో ఈ కీలక పదవిని అందుకోవడం మంచిది అన్నదే బొత్స ఆలోచన. అంతే కాదు గెలిచిన తరువాత శాసనమండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదాను కూడా ఆయన కోరుకుంటున్నారు.
వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టడానికి జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారు అని అంటున్నారు. బీసీ నేతగా సీనియర్ గా బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు అని జగన్ భావిస్తున్నారుట.
బొత్స సైతం ఈ కండిషన్ పెట్టి జగన్ అంగీకరించిన మీదటనే ఎమ్మెల్సీ పదవికి పోటీకి దిగారు అని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే క్యాంప్ రాజకీయాలు చేయడమే. వైసీపీకి ఉన్న ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకుంటూ వారిని పోలింగ్ రోజు దాకా తమ వెంట ఉంచుకోవడం అంటే అంగబలం అర్ధ బలం ఉండాలి. అలాగే రాజకీయంగా కూడా పదునైన వ్యూహాలను రచించాలి.
బొత్స ఆ విషయంలో సిద్ధహస్తుడు కాబట్టే జగన్ ఆయనను ఎంపిక చేశారు అని అంటున్నారు. బొత్సను దింపడం ద్వారా కూటమి వల్ల ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంభవించిన ఘోరమైన అవమానాన్ని మరచి తొలి విజయాన్ని అందుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. బొత్స కూడా కేబినెట్ ర్యాంక్ కలిగిన మండలి ప్రతిపక్ష నేత హోదా మీద కన్నేశారు అని అంటున్నారు.
ఇలా బొత్సను జగన్ ఎంపిక చేయడం ఆయన అంగీకరించడం ఎవరి మటుకు వారికి బాగున్నా విశాఖ జిల్లా వైసీపీలో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలను బొత్స ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందుగా నాయకులను దారికి తేవాల్సి ఉంది. లేకపోతే క్రాస్ ఓటింగ్ బెడద పొంచి ఉంటుంది. అసలే ఈ సీటుని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని టీడీపీ కూటమి పట్టుదల మీద ఉందని అంటున్నారు. మొత్తానికి బొత్స పెద్ద ఆలోచనలతోనే పెద్దల సభలో పదవికి పోటీకి దిగారు అని ప్రచారం అయితే సాగుతోంది.