టీడీపీ లోకి బొత్స ఫ్యామిలీ...?
బొత్స ఫ్యామిలీలో ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంటున్నారు
By: Tupaki Desk | 12 Aug 2023 5:03 PM GMTఅవునా ఇది నిజమేనా అంటే రాజకీయం అంటే ఇదే అనుకోవాలి మరి. ఎవరు ఎపుడు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీ నుంచి జంప్ చేస్తారో ఎవరికి ఎరుక అనే అంటారు. ఇదిలా ఉండగా వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ఘాటు వ్యాఖ్య తాజాగా చేశారు. వచ్చే ఉగాది పండుగ నాటికి ఏపీలో రెండు పార్టీలు మటు మాయం అవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ పార్టీలు జనసేన టీడీపీ అని ఆయన అంటున్నారు.
ఒకవేళ కనుక ఆ పార్టీకు మాయం కాకపోతే తన గుండు కొట్టించుకుంటాను అని సవాల్ చేశారు. అంటే 2024 లో ఎన్నికలు జరుగుతాయని ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన మరోమారు ఘోరంగా ఓటమి పాలు అవుతాయన్నదే బొత్స మార్క్ జోస్యం అని అర్ధం చేసుకోవాలన్న మాట. ఇదిలా ఉంటే బొత్స మాటలకు కౌంటర్లు పడతాయి కదా.
అది కూడా పెద్ద నోరు చేసుకుని వైసీపీ మీద విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఈ బాధ్యత తీసుకున్నారు. ఆయన ఏకంగా బొత్స ఫ్యామిలీనే టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మాయం కావడం కాదు, బొత్స ఫ్యామిలీ సహా వైసీపీకి చెందిన యాభై మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని ఒక బాంబు పేల్చారు.
వారంతా ఎపుడో ఒకపుడు వైసీపీని వీడి టీడీపీలో చేరకతప్పదని అన్నారు. ఈ మేరకు తమకు పూర్తి సమాచారం ఉందని అన్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో బొత్సను ఏకంగా ఆయన సొంత సీటు చీపురుపల్లిలోనే ఓడించి తీరుతామని కూడా బోండా ఉమా అన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కాక మళ్లీ రేగింది. రెండు పార్టీలు పోతాయని బొత్స అంటే ఏకంగా బొత్స ఫ్యామిలీయే తమతో టచ్ లో ఉందని బోండా అనడంతో ఇందులో వాస్తవాలు ఎంత అని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బొత్స ఫ్యామిలీలో ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంటున్నారు. సో ఆయన పార్టీ మారేది లేదు. ఇక మరో చుట్టం, బడికొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల టికెట్ కన్ ఫర్మ్ కాబట్టి ఆయన కూడా పార్టీలో ఉంటారు. అయితే అదే నెల్లిమర్ల సీటును ఆశిస్తున్న బొత్స తమ్ముడు లక్ష్మణరావు కుమారుడు మాత్రం పార్టీ లైన్ దాటుతారా అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.
ఇక ఎస్ కోటలో ఉన్న వైసీపీ సిట్తింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. ఆయన బొత్స సన్నిహిత బంధువే అంటారు. ఆయనకు టికెట్ దక్కకపోతే పార్టీ మారుతారా అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే విజయానగరం ఎంపీగా ఉన్న బొత్స మరో బంధువు బెల్లాన చంద్రశేఖర్ కి ఈసారి ఎంపీ టికెట్ దక్కదని అంటున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యే కోసమే చూస్తున్నారు.
మరి టికెట్ దక్కకపోతే ఆయన ఏమైనా పార్టీ ఫిరాయిస్తారా అన్నది చూడాలని అంటున్నారు. ఇలా బొత్స బంధువులు లిస్ట్ ఉంటే సన్నిహితులు, అనుచరుల జాబితాలో కూడా కొందరు కీలక నేతలు ఉన్నారు. వారు కూడా ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఫలించకపోతే వారంతా జెండాను ఎగరేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా కనుక చూస్తే మాత్రం బొత్స ఫ్యామిలీలోనే అనుమానాలు పెంచే విధంగా బొండా బాంబు పేల్చారని అంటున్నారు.