Begin typing your search above and press return to search.

మంత్రి బొత్స ముహూర్తం పెట్టేశారుగా!

ఎందుకంటే.. ఇప్పుడు జ‌రుగుతున్న పోస్ట్ పోల్ అరాచ‌కాలు పెద్ద ఎత్తున జాతీయ అంత‌ర్జాతీయ మీడి యాలోనూ ప్ర‌సారం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 May 2024 3:48 AM GMT
మంత్రి బొత్స ముహూర్తం పెట్టేశారుగా!
X

ఏపీలో ఆసక్తిక‌ర రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. తాంబూలాలిచ్చేసిన‌ట్టుగా.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత‌.. ఒక‌వైపు ప‌లు జిల్లాల్లో హింస చెల‌రేగుతుండగా.. మ‌రోవైపు అధికార పార్టీ నాయ‌కులు రెండో సారి అధికారం కోసం ముహూర్తాలు పెట్టుకునే ప‌నిలో ఉన్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో మంత్రులు.. ఇత‌ర అధికారులు కూడా.. రాష్ట్రంలో శాంతి ఏర్ప‌డేలా ప్ర‌య‌త్నించాలి. లేక‌పోతే.. భ‌విష్య‌త్తులో పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు ఇబ్బందులు వ‌స్తాయి.

ఎందుకంటే.. ఇప్పుడు జ‌రుగుతున్న పోస్ట్ పోల్ అరాచ‌కాలు పెద్ద ఎత్తున జాతీయ అంత‌ర్జాతీయ మీడి యాలోనూ ప్ర‌సారం అవుతున్నాయి. వీటిని అంత‌ర్జాతీయ స‌మాజం సీరియ‌స్‌గాతీసుకుంటే.. ఏపీపై దుష్ప్రభావం ప‌డుతుంది. ఇది ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. రాష్ట్రంపై మాత్రం చెడుముద్ర ప‌డి అది అంతిమంగా పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంది. ముందు ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన సీఎం నుంచిమంత్రుల వ‌ర‌కు దీనిని వ‌దిలేశారు.

ఇంకా.. ఎన్నిక‌ల పోలింగ్ ఫ‌లితాల‌కు స‌మ‌యం 15 రోజుల‌కు పైగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే స‌ర్కారు ఏర్పాట్ల‌పై త‌ల‌మున‌క‌లు అవుతున్నారు. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏకంగా.. సీఎం జ‌గ‌న్ రెండో సారి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి సంబంధించి ముహూర్తాలు పెట్టేయ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. జూన్ 4న ఫ‌లితాలు వ‌స్తాయ‌ని 9వ తేదీ న జ‌గ‌న్ మరోసారి ముఖ్య‌మంత్రిగా విశాఖ ప‌ట్నంలోనే ప్ర‌మాణం చేస్తార‌ని బొత్స చెప్పుకొచ్చారు.

అయితే. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క దిద్ద‌కుండా.. పాల‌న‌ను చూడ‌కుండా ఈ ముహూర్తాల గోలెందుకు అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంకా స‌మ‌యం చాలానే ఉంద‌ని.. ప్ర‌స్తుతం ప్ర‌జా పాల‌న‌.. రైతుల స‌మ‌స్య‌లు, ఇత‌ర అంశాల‌తోపాటు హింస‌ను అదుపు చేయ‌డంపై త‌క్ష‌ణం దృష్టి పెట్టాల‌నివారు కోరుతున్నారు. కానీ.. స‌ర్కారు వైపు నుంచి ఎవ‌రూ కూడా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. జ‌గ‌న్‌ను ముఖ్యమంత్రిని చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల నాడి జ‌గ‌న్ వైపే ఉంద‌ని జోస్యాలు చెబుతూ.. కాలం వెళ్ల‌దీస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.