ఇక కటింగే అంటున్న బొత్స... జగన్ అదే చేస్తున్నారుట...!
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. పదకొండు మందితో విడుదల అయిన జాబితా తరువాత ఇక చాలా మార్పుచేర్పులు ఉంటాయని ఆయన అంటున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2023 12:05 PM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడెన్ గా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పదకొండు మంది అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇంచార్జిలను నియమించారు. ఈ మార్పు చేర్పులలో కొందరికి టికెట్ కటింగ్ అయితే మరి కొందరికి స్థాన చలనం కలిగింది. ఇందులో ముగ్గురు మంత్రులు ఒక మాజీ మంత్రి కూడా ఉన్నారు.
అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నట్లుగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. పదకొండు మందితో విడుదల అయిన జాబితా తరువాత ఇక చాలా మార్పుచేర్పులు ఉంటాయని ఆయన అంటున్నారు. తీసివేతలే ఎక్కువగా ఉంటాయని హింట్ కూడా ఇచ్చారు.
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ తిరిగి గెలవాలని వైసీపీ అధినేత జగన్ ఆలోచన చేస్తున్నారు అని ఆయన చెప్పారు. అంతే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని అన్నారు. జగన్ మాటల మనిషి కాదని ఆయన చేతల మనిషి అని బొత్స అన్నారు.
అందుకే తమ నాయకుడు బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అన్నారు. అయితే పార్టీకి అందరూ కావాలని ఏ ఒక్కరినీ వదులుకోదని బొత్స స్పష్టం చేశారు. మంగళగిరి ఇంచార్జిగా గంజి చిరంజీవిని నియమించినా అక్కడ ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని కూడా వదులుకోమని అన్నారు. పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుంది అని బొత్స వెల్లడించారు.
అదే విధంగా ఏపీలో చాలా చోట్ల ఆయా పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పులు ఉంటాయని ఆయన అంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కొంతమంది బాధపడితే పడవచ్చు కానీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యానే ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తున్నారు అని ఆయన అన్నారు. దీనిని అంతా అర్ధం చేసుకుని సహకరిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక సీనియర్ నేతగా బొత్స మరోమాట కూడా అన్నారు. పార్టీ తల్లి లాంటిదని దానిని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తారని ఆశిస్తున్నట్లుగా ఆయన చెప్పడం విసేషం. అదే విధంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రజలకు జగన్ జవాబుదారీగా ఉంటూ వస్తున్నారు అని గుర్తు చేశారు. అందుకే ఆయన అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు అని కూడా వివరిస్తున్నారు.
తాజాగా మార్పులు చేసిన పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల నిర్ణయం వెనక ప్రజాభీష్టం ఉందని కూడా బొత్స అనడం విశేషం. ఇది మాత్రమే కాదు భవిష్యత్తులో భారీ మార్పులు ఉంటాయని బొత్స అనడం ఒకింత సంచలనమే అని చెప్పాలి.అంటే ఆ భారీ మార్పులు ఏంటి అన్నదే ఇపుడు చూడాల్సి ఉంది అని అంటున్నారు.
వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా మరోసారి గెలవడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వైసీపీకే రావాలని కూడా ఆయన గట్టిగా ఆనాక్షించారు. ఏది ఏమైనా చూస్తే బొత్స చెబుతున్న దాన్ని బట్టి ముందు ముందు అనేక సంచలన పరిణామాలు పార్టీలో చోటు చేసుకునే చాన్స్ అయితే ఉంది. సో ఇక ఏపీ రాజకీయం మొత్తం వైసీపీ వైపే చూస్తుంది అన్న మాట.