లైన్లోకి మేనల్లుడు.. మరి ఆ మంత్రి పరిస్థితి ఏమిటి?
బొత్స సత్యనారాయణ.. పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు
By: Tupaki Desk | 18 Aug 2023 11:30 PM GMTబొత్స సత్యనారాయణ.. పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఓవైపు తాను విద్యా శాఖ మంత్రిగా, తన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా, ఇంకో బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేనా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఇలా బొత్స కుటుంబం విజయనగరం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది.
కాగా ఇప్పుడు ఒక వార్త ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ గా కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రాంతీయ సమన్వయకర్తగా ఉత్తరాంధ్ర జిల్లాలపై బొత్స విస్తృతంగా దృష్టి సారించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన తన నియోజకవర్గమైన చీపురుపల్లిపైన అంతగా దృష్టి సారించే సమయం ఉండకపోవచ్చని చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య బొత్స సత్యనారాయణను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. బొత్స ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి ఆయన మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.
ఇన్నాళ్లూ చిన్న శ్రీను తన మేనమామ బొత్స వెనుక ఉండి ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషించారు. గతంలో బొత్స సతీమణి ఝాన్సీ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కూడా ఆమె విజయంలోనూ చిన్న శ్రీనుదే ప్రధాన పాత్ర.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయనగరంలో జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు జిల్లా మొత్తం చిన్న శ్రీను కూడా జగన్ తో కలిసి పాదయాత్ర చేశారు. ఇక ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావడంతో జిల్లాపై చిన్న శ్రీను గట్టి పట్టు సాధించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న శ్రీనును చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించి బొత్స సత్యనారాయణను విజయనగరం నుంచి పార్లమెంటుకు పోటీ చేయిస్తారని పేర్కొంటున్నారు. మరి ఈ ప్రతిపాదనకు బొత్స అంగీకరిస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే.