వైఎస్ షర్మిళ రాకపై బొత్స హాట్ కామెంట్స్!
ఉత్తరాధిలో గట్టి ఎదురుదెబ్బలే తగిలినప్పటికీ... దక్షిణాదిలో మాత్రం కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది
By: Tupaki Desk | 31 Dec 2023 5:18 AM GMTఉత్తరాధిలో గట్టి ఎదురుదెబ్బలే తగిలినప్పటికీ... దక్షిణాదిలో మాత్రం కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఊహించని రీతిలో అన్నట్లుగా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఉత్సాహంలో భాగంగా ఏపీలోనూ పూర్వ వైభవం సాధించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో... ఏపీ కాంగ్రెస్స్ పార్టీ బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించబోతున్నారనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఈ విషయలపై బొత్స స్పందించారు.
అవును... కర్ణాటక, తెలంగాణ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా పూర్వ వైభవం సంపాదించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విషయాలపై ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు కూడా... ఏపీకి కాంగ్రెస్ లోకి షర్మిళ వస్తున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నారు. ఈ సమయంలో ఈ విషయాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇందులో భాగంగా.. షర్మిళ రాకతో తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు.
వాస్తవానికి పార్టీలు ఎన్ని ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో పక్షాలు మాత్రం రెండే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకటి అధికార వైసీపీ... మిగిలినవి టీడీపీ & కో అనే అనుకోవాల్సిన పరిస్థితి! వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా... విపక్షాలు ఎవరు ఎవరు కలిసి పోటీ చేస్తారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా విపక్షాలన్నీ కలిసే ప్రయాణం చేస్తాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని షర్మిళ ఎలాంటి రాజకీయం చేయబోతున్నారనేది వేచి చూడాలి. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిళ రావడం వల్ల ఏమీ జరిగిపోదు అని జోస్యం చెప్పారు బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో... వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. అదేవిధంగా తమ పార్టీ పటిష్టంగా ఉందని బొత్సా స్పష్టం చేస్తున్నారు.
ఇక ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు అనేవి అత్యంత సహజం అని... ప్రతీ పార్టీలోనూ ఎన్నికల ముందు జరిగేదే అని బొత్స క్లారిటీ ఇచ్చారు. వైసీపీ స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తుందని.. వచ్చేసారి కూడా వైఎస్ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన అన్ని హామీలనూ తుచ తప్పకుండా అమలు చేశామని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బొత్స. ఇందులో భాగంగా చంద్రబాబు రెండు చోట్ల కాదు.. రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ పోటీ చేయొచ్చని, ఆ హక్కు ఆయనకు ఉందని బొత్స వ్యాఖ్యానించారు. ఇక తనపై చీపురుపల్లిలో పోటీ చేసిన లేదా విశాఖ నుంచి పోటీకి దిగిన సమర్థవంతంగా చంద్రబాబును ఎదుర్కొంటామని చెప్పారు!