Begin typing your search above and press return to search.

బొత్సకు చెలగాటం .. అప్పిరెడ్డికి ప్రాణసంకటం !

ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. ఉత్తరాంధ్రలో పేరున్న నేత.

By:  Tupaki Desk   |   20 Aug 2024 8:24 AM GMT
బొత్సకు చెలగాటం .. అప్పిరెడ్డికి ప్రాణసంకటం !
X

ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. ఉత్తరాంధ్రలో పేరున్న నేత. 1999లో బొబ్బిలి ఎంపీగా, 2004, 2009లలో వైఎస్, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, 2019 నుండి 2024 వరకు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా తాజాగా జరిగిన శాసనమండలి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పి టీడీపీని నిలువరించి 2019 ఎన్నికలలో వైసీపీ భారీ విజయాలు సాధించేలా బొత్స పనిచేశాడు. అయితే ఎన్నికల తర్వాత బొత్స మంత్రిగా ఉన్నా ఉత్తరాంధ్ర రాజకీయాలో వైసీపీ పెత్తనం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అప్పజెప్పడంతో స్థానికేతరుల జోక్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చెలరేగి ఇటీవల అక్కడ వైసీపీ ఘోరపరాజయం దక్కింది.

కూటమి ఘనవిజయం తర్వాత విశాఖ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడంతో వైసీపీ సీనియర్ నేత అయిన బొత్సకు అవకాశం ఇచ్చింది. అక్కడ టీడీపీ నుండి పోటీగా అభ్యర్థిని నిలబెడతారని అనుకున్నా ప్రస్తుత పరిస్థితులలో ఒక శాసనమండలి స్థానం కోసం అభ్యర్థిని పెట్టి విజయం కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుందాగా ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించాడు.

అయితే ఇటీవల ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలు ఉన్న వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయింది. అయితే ఆ పార్టీకి శాసనమండలిలో 40 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొద్దిరోజుల క్రితం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా జగన్ నియమించారు. తాజాగా సీనియర్ నేత అయిన బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో అప్పిరెడ్డికి చిక్కులు వచ్చి పడ్డాయి.

శాసనమండలిలో ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. ప్రస్తుతం కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు కూడా క్యాబినెట్ హోదా లేకుండా పోయింది. అయితే క్యాబినెట్ హోదా ఉన్న నేపథ్యంలో శాసనమండలిలో పగ్గాలు తనకు అప్పగించాలని బొత్స ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ పరిస్థితులలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? అప్పిరెడ్డి క్యాబినెట్ హోదా మూణ్ణాళ్ల ముచ్చటేనా ? అన్న చర్చ వైసీపీలో మొదలయింది.