మంత్రి బొత్సకు గుండె సమస్యలు!
వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
By: Tupaki Desk | 10 Nov 2023 6:01 AM GMTవైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె కవాటాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ప్రాథమిక పరీక్షల్లో హృదయ స్పందనల్లో మార్పులు గుర్తించడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం తనయుడు సందీప్ తో కలిసి హైదరాబాద్ వెళ్లారు. స్థానిక వైద్యుల సూచనలతో ఆయన హైదరాబాద్ వెళ్లారు.
హైదరాబాద్ లో జరిగిన వైద్య పరీక్షల్లో బొత్స గుండెకు చికిత్స అవసరమని వైద్యులు నిర్దారించినట్లు సమాచారం. యాంజియోగ్రామ్ పరీక్షల ఆధారంగా బొత్సకు ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్యులు ఓ నిర్ణయానికి రానున్నారు. నిపుణుల సూచనల మేరకు బొత్స గుండెకు స్టెంట్లు వేయాలా లేదా శస్త్ర చికిత్స చేయాలా అనేది వైద్యులు నిర్ణయించనున్నట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం మంత్రి బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమంలో బొత్స చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఎస్.కోటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 5న శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లారు. అయితే గుండెలో కాస్త ఇబ్బంది అనిపించడంతో ఈ నెల 6న విశాఖలోని అపోలో ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో ప్రాథమికంగా సమస్యలు వెలుగులోకి రావడంతో మరిన్ని పరీక్షల కోసం ఆయన్ని హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో గురువారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. గురువారమే విజయనగరంలో జరిగిన మేనకోడలు వివాహానికి కూడా ఆయన హాజరు కాలేదు.