Begin typing your search above and press return to search.

బొత్స లక్కీ గురూ !

వైసీపీకి ఇటీవల ఎన్నికల్లో లభించిన భారీ ఓటమి తరువాత అన్నీ చేదు విషాద వార్తలే

By:  Tupaki Desk   |   13 Aug 2024 2:30 PM GMT
బొత్స లక్కీ గురూ !
X

వైసీపీకి ఇటీవల ఎన్నికల్లో లభించిన భారీ ఓటమి తరువాత అన్నీ చేదు విషాద వార్తలే. వైసీపీకి లభించిన 11 ఎమ్మెల్యే సీట్లను బట్టి చూస్తే రానున్న అయిదేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ ఒక్క ఎమ్మెల్సీ సీటు కానీ ఒక్క రాజ్యసభ ఎంపీ సీటు కానీ ఆశించలేని దుర్బర పరిస్థితి.

అయితే ఓడి రెండు నెలలు కాలేదు. ఇంతలోనే వైసీపీకి సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు మాత్రం పెద్దల సభలో ఎమ్మెల్సీగా అవకాశం లభించినట్లు అయింది. విశాఖ ఎమ్మెల్సీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ కూటమి తరఫున ఎవరైనా అభ్యర్థిని నిలబెడితే గట్టి ఫైట్ జరిగేది. ఫిరాయింపులు కూడా భారీ ఎత్తున ఉండేవి.

ఇక క్యాంప్ రాజకీయాలలో ఎంత ధనం పారాల్సి ఉంటుందో కూడా లెక్కే లేదు. కానీ ఇవేమీ లేకుండా టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుని బొత్సకు చాన్స్ ఇచ్చేసింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లకు గడువు ముగిసే వేళకు రెండే రెండు నామినేషన్లు దాఖలు అయినట్లుగా అధికారులు ప్రకటించారు.

అందులో ఒకటి బొత్సది అయితే రెండవది ఇండిపెండెంట్ అభ్యర్థిగా షఫీ ఉల్లాది. దీంతో బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక అన్నది లాంచనం అని తేలిపోయింది. షఫీ ఉల్లాతోనే నామమాత్రం పోటీ ఉండొచ్చు. ఒకవేళ ఆయన నామినేషన్ ఉపసంహరించుకుంటే ఏకగ్రీవం కూడా కావచ్చు.

ఏది ఏమైనా బొత్స వెరీ లక్కీ అని అంటున్నారు. వైసీపీ నుంచి బిగ్ షాట్స్ అందరూ ఓటమి పాలు అయ్యారు. ఆరున్నర పదులు దాటిన మాజీ మంత్రులు చాలా మంది అయితే ఇక రాజకీయం చాలు అని అనుకునే నేపథ్యం ఉంది. కానీ బొత్స రాజకీయం మాత్రం ఏ మాత్రం బ్రేకులు లేకుండా ఊపందుకోవడం అంటే బొత్స గ్రేట్ అనే అనుకోవాలి.

ఇక ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవిని కూడా కోరుతున్నారు అని టాక్ అయితే నడుస్తోంది. అదే నిజం అయితే ఆయనకు ఆ పదవి కట్టబెడితే బొత్సకు కేబినెట్ ర్యాంక్ దక్కుతుంది. మొత్తం మీద చూసూంటే 2027 డిసెంబర్ 8 వరకూ బొత్స ఎమ్మెల్సీ పదవికి ఎలాంటి ఢోకా లేదు. ఆ తరువాత ఏణ్ణర్ధంలో ఎటూ సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి కాబట్టి బొత్స ఓటమి బాధల నుంచి బయటకు వచ్చినట్లే.

ఆయన రాజకీయ జీవితం కూడా కుదురుకున్నట్లే. వైసీపీలో ఎంతో మంది ఎమ్మెల్సీ సీటు ఆశిచినా కూడా బొత్సను జగన్ ఎంపిక చేయడంతోనే ఆయన రాజకీయ జాతకం మారింది అని అంటున్నారు. బొత్స లోక్ సభ సభ్యునిగా 1999 నుంచి 2004 దాకా బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరఫున పనిచేశారు. ఆ తరువాత ఆయన 2004 నుంచి 2012 దాకా వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలు చూసారు.

2012 నుంచి 2014 దాకా ఆయన ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా కూడా పనిచేసారు. 2014లో కాంగ్రెస్ నుంచి చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి అత్యధిక ఓట్లు తెచ్చుకున్న బొత్స ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ వైపు మళ్లారు.

అలా ఆయన వైసీపీలో చేరి 2019 నుంచి 2024 దాకా జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగారు. ఇపుడు మళ్లీ ఆయన పెద్దల సభకు వెళుతున్నారు. బొత్స రాజకీయ జీవితంలో కీలకమైన నాలుగు చట్ట సభలలో మూడింట అడుగు పెట్టినట్లు అయింది. ఒక్క రాజ్యసభ తప్ప ఆయన అన్ని చట్ట సభలలో ప్రవేశించిన ఘనతను కూడా దక్కించుకున్నారు. ఇక ఎమ్మెల్సీగా కొత్త జీవితాన్ని బొత్స ఏ విధంగా దూకుడుగా స్టార్ట్ చేయబోతున్నారో చూడాల్సిందే.