Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల దారిలోనే వైసీపీ సాగుతుందా ?

మూడు రాజధానుల విధానం నుంచి మేము మార్చుకున్నట్లు మీకు చెప్పలేదు కదా అని ఎదురు ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 1:30 PM GMT
మూడు రాజధానుల దారిలోనే వైసీపీ సాగుతుందా ?
X

వైసీపీ మూడు రాజధానుల విధానంతో ఇంకా ఉందా అంటే ఆ పార్టీ ఈ రోజు వరకూ స్టాండ్ మార్చుకున్నట్లు ఎక్కడా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. దాని మీద క్లారిటీ కోసం మీడియా వైసీపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణను ప్రశ్నించినప్పుడు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానుల విధానం నుంచి మేము మార్చుకున్నట్లు మీకు చెప్పలేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతానికి అయితే ఆ విధానం మూడు రాజధానులు అని ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ మేము ఏమైనా మార్చుకుంటే మీడియాకే మొదట చెబుతామని అన్నారు.

మా విధానం ప్రకారం విశాఖ సహా ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి సాగాలని ఆయన కోరారు. ఈ విషయంల పార్టీలకు అతీతంగా అంతా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎమ్మెల్సీగా ప్రమాణం మాత్రమే చేశామని సభలో మాట్లాడినపుడు అనేక విషయాలు ప్రస్తావిస్తామని అన్నారు.

కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 75 రోజులు మాత్రమే అయింది అని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వాటిని నెరవేర్చాలని తాము కోరుతున్నామని అన్నారు. ప్రజా సమస్యల విషయంలో తమ పార్టీ రాజీపడబోదని బొత్స అన్నారు. తాము ప్రజల కోసం పనిచేస్తామని ప్రచారం కోసం కాదని అన్నారు.

అసెంబ్లీకి జగన్ కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ రావడం రాకపోవడం సమస్య కానే కాదని తాము ప్రజా సమస్యల విషయంలో ఎంతవరకూ చొరవ చూపిస్తున్నామన్నది మాత్రమే విషయం అని అన్నారు. వైసీపీ మాత్రం ప్రజా సమస్యల విషయంలో అసలు రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే బొత్స చెప్పిన మూడు రాజధానుల విధానం మీదనే చర్చ సాగుతోంది. నిజానికి ఈసారి ఎన్నికల్లో ఈ అంశం కూడా ఒక రిఫరెండం గానే ఉందని అంటున్నారు. వైసీపీని ఓడించి టీడీపీ మూడు చోట్లా గెలిపించారు అంటే ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకం అనే కదా అన్న చర్చ ఉంది.

అదే సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే అమరావతిని ఈ అయిదేళ్లలో ఒక రూపునకు తీసుకుని రావాలని చూస్తోంది. ఎందుకంటే మళ్లీ వైసీపీ వస్తే ఏపీకి రాజధాని ఉండదని కూడా టీడీపీ కూటమి పెద్దలు ప్రచారం చేస్తున్నారు.

ఇలాంటి కీలకమైన సందర్భంలో వైసీపీ ఎంతో ముఖ్యమైన రాజధాని విషయంలో తన నిర్ణయం ఏమిటో ఇప్పటికైనా స్పష్టంగా ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. మూడు రాజధానులు ప్రస్తుతానికి అని బొత్స అస్పష్టమైన ప్రకటన చేశారు. మూడు రాజధానులే మా విధనం అంటే అదొక దారి. అలా కాకుండా అమరావతినే రాజధానిగా ఉంచుతూ మిగిలిన రెండు వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరినా వైసీపీ రాజకీయ విధానం రాణిస్తుంది.

ఏమీ కాకుండా మూడు రాజధానులు అని పట్టుకుని ముందుకు సాగినా లేక ఈ రోజుకు ఇదే విధానం రేపు ఏమిటో అని చెప్పకుండా వదిలేసినా అది వైసీపీకే ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మూడు రాజధాని విధానం వైసీపీ మెడకు గుదిబండగా మారిందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళూ ఒక దారిలో నడచి ఇప్పుడు ఓపెన్ గా అమరావతికి జై కొట్టలేరు. అలాగని మూడు రాజధానులతో ముందుకు పోవాలంటే ఇబ్బందులు ఏంటో ఫలితాలు చెప్పాయి. సో వైసీపీకి ఇది ఇరకాటమే అని అంటున్నారు.