బొత్స రెడీ...జగన్ రెడీనా ?
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి అయిపోయారు.
By: Tupaki Desk | 16 Aug 2024 10:30 PM GMTఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి అయిపోయారు. ఆయన ఎన్నికను ధృవీకరిస్తూ ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆయనను విజేతగా ప్రకటించారు. దాంతో బొత్స శాసనమండలి సభ్యుడు అయిపోయారు. ఆయన పెద్దల సభలోకి తొలిసారి అడుగుపెట్టనున్నారు.
బొత్స రాజకీయ జీవితం చూసుకుంటే 1999లో తొలిసారి బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నిక అయ్యారు. 2004, 2009లలో రెండు సార్లు చీపురుపల్లి నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గి వైఎస్సార్ రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2012 తరువాత ఆయన ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. కిరణ్ ని ఒక దశలో తప్పించి బీసీ నేతను సీఎం చేయాలని హై కమాండ్ ఆలోచించిందని వార్తలు అప్పట్లో వచ్చాయి.
అలా రేసులో బొత్స పేరు వినిపించింది. ఆయన పీసీసీ చీఫ్ కావడం కూడా ఆయన పేరు వినిపించడానికి మరో కారణం. అయితే కాంగ్రెస్ పెద్దలు చివరి నిముషంలో ఆలోచనలు మానుకోవడంతో బొత్స సీఎం కాలేకపోయారు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడినా అధిక ఓట్లూ డిపాజిట్ తెచ్చుకున్న వారుగా బొత్స ఉన్నారు. 2019లో వైసీపీ తరఫున గెలిచి అయిదేళ్ళ పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఘనతను బొత్స సాదించారు.
ఇక 2024లో ఆయన ఓటమి పాలు అయ్యారు. అయినా రెండు నెలలు తిరగకుండానే చట్ట సభలకు బొత్స వెళ్లడం విశేషం. ఇక బొత్స ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఉత్త ఎమ్మెల్సీగా మిగిలిపోతారా లేక జగన్ ఆయనకు ప్రమోషన్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.
సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బొత్సను శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపొజిషన్ గా జగన్ నియమిస్తారు అని అంటున్నారు. అదే జరిగితే బొత్స రొట్టె విరిగి నేతిలో పడినట్లే. బొత్సను ముందు పెట్టి వైసీపీ సర్కార్ ని చెడుగుడు ఆడాలన్నది జగన్ వ్యూహం. అదే సమయంలో బొత్సకు ఈ కీలకమైన పదవి ఇస్తే జగన్ కంటే ఆయనే పవర్ ఫుల్ అవుతారు. మరి అది వైసీపీ హై కమాండ్ ఎంతవరకూ సర్దుకుంటుంది అన్నది కూడా మరో ఆలోచనగా ఉంది.
జగన్ అయితే అసెంబ్లీలో జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే. కానీ బొత్స అపొజిషన్ లీడర్ అయితే కేబినెట్ ర్యాంక్ హోదాని పొందుతారు. పైగా అసెంబ్లీ కంటే మండలి ప్రతిపక్ష నేతనే ప్రోటోకాల్ లో అగ్ర పీఠం ఉంటుంది. మరి బొత్స రాజకీయంగా సీనియర్ వ్యూహకర్త. ఆయనను నమ్మి పార్టీలో అత్యంత కీలకమైన పదవి తనకంటే కూడా ఎక్కువ స్థానం కల్పించే విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏ విధమైన డెసిషన్ కి వస్తుంది అన్నది చూడాల్సి ఉంటుందని అంటున్నారు.
ఒకవేళ బొత్సకు సాధారణ ఎమ్మెల్సీగా ఉంచితే ఆయనలో అసంతృప్తి చెలరేగడం ఖాయం. అలా కాకుండా ఆయనకు కీలక హోదా ఇస్తే అపుడు ఆయన రాజకీయ దూకుడు వైసీపీకి ప్లస్ గా ఉంటుందా లేక వేరే విధంగా ఉంటుందా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా బొత్స గెలిచి చూపించారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సి ఉంది.