Begin typing your search above and press return to search.

అంత తొందరేల బొత్స.. మూడు రాజధానుల మీద ఇప్పుడే మాట్లాడాలా?

దీంతో 151 స్థానాలున్న వైసీపీకి కేవలం 11 స్థానాలకే పరిమితం చేయటం.. తల పండిన నేతలందరూ ఓటమిపాలు కావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 July 2024 4:43 AM GMT
అంత తొందరేల బొత్స.. మూడు రాజధానుల మీద ఇప్పుడే మాట్లాడాలా?
X

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు. గత ఎన్నికల వేళలో ఆగిపోదన్న రాజధాని అమరావతిని.. ఇచ్చిన మాటకు భిన్నంగా మూడు రాజధానుల పేరుతో చేపట్టిన కార్యక్రమాలు.. తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఓటమికి ఒక కారణంగా వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ.. ఐదేళ్ల పాలనలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవటం.. పనులు జరగకపోవటం జగన్ సర్కారుకు మైనస్ గా మారింది. మొత్తంగా అమరావతి రాజధాని అన్న దానికి భిన్నంగా మూడు రాజధానుల మీద ఏపీ ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది లేదు.

దీంతో 151 స్థానాలున్న వైసీపీకి కేవలం 11 స్థానాలకే పరిమితం చేయటం.. తల పండిన నేతలందరూ ఓటమిపాలు కావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ప్రజల మూడ్ ను గుర్తించి.. వారు తమను తిరస్కరించేందుకు కారణమైన అంశాల విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేసి.. తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఏముందన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుంది.కానీ.. మాజీ మంత్రి బొత్స బాబాయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పద మూడు రాజధానుల వ్యవహారంపై మళ్లీ మాట్లాడారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ తాము ఇప్పటికి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని.. అదే తమ పార్టీ విధానమని స్పష్టం చేసిన వైనం షాకింగ్ గా మారింది. తాజాగా విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఆయన.. రాజధానుల మీద క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ విధానం ప్రకారం మూడు రాజధానులేనని స్పష్టం చేశారు. దీంతో.. అమరావతికి వ్యతిరేకమన్న విషయాన్ని మళ్లీ స్పష్టం చేసినట్లైంది.

కూటమి సర్కారుపై విమర్శలు సంధించిన బొత్స.. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చిందో తమకు తెలీటం లేదన్న బొత్స.. వైసీపీ జిల్లా ఆఫీసుల మీద జరుగుతున్న రాద్దాంతాన్ని తప్పు పట్టారు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ప్రతిపక్ష పార్టీల ఆఫీసులను సందర్శించటం మంచి పద్దతి కాదన్నారు. ఇటీవల విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.. వైసీపీ కార్యాలయాన్ని సందర్శించిన వైనాన్ని ప్రస్తావించారు.మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. మూడు రాజధానులపై చేసిన వ్యాఖ్యలు తొందరపాటుతో కూడుకున్నవిగా అభిప్రాయపడుతున్నారు.