బొత్స వారసుడు ఆయనేనా...?
ఇంకో వైపు చూస్తే చీపురుపల్లికి బొత్స కుమారుడి పేరు గట్టిగానే వినిపిస్తోంది. సందీప్ కి ప్రత్యక్ష రాజకీయాలతో ఈ రోజు వరకూ పెద్దగా పరిచయం లేదు.
By: Tupaki Desk | 13 Nov 2023 4:15 AM GMTఉత్తరాంధ్రాలో సీనియర్ బీసీ మంత్రిగా బొత్స సత్యనారాయణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కాంగ్రెస్ లో ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. సీఎం పోస్ట్ తృటిలో తప్పిపోయింది కూడా. విభజన ఏపీలో పొలిటికల్ రియాల్టీస్ ని తెలుసుకుని మరీ వైసీపీలో చేరిపోయారు. మంత్రిగా ఆయన నాలుగున్నరేళ్ళుగా జగన్ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.
ఈసారి ఆయన ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేస్తేనే బెటర్ అని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఇక బొత్స మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి 2024 ఎన్నికల్లో మరోసారి పోటీకి రెడీ అంటున్నారు. ఒకవేళ తనకు కాకపోతే తన కుమారుడు డాక్టర్ సందీప్ కి టికెట్ ఇవ్వాలని కూడా అడుగుతున్నారు.
అలా అయితే తాను ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేస్తాను అని ఆయన అంటున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే బొత్స తాజాగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా సాగింది. ఆయనకు నెల రోజుల రెస్ట్ అవసరం అని డాక్టర్లు చెప్పారు. దాంతో బొత్స కొత్త సంవత్సరంలోనే పొలిటికల్ గా యాక్టివ్ అవుతారు అని అంటున్నారు
ఇంకో వైపు చూస్తే చీపురుపల్లికి బొత్స కుమారుడి పేరు గట్టిగానే వినిపిస్తోంది. సందీప్ కి ప్రత్యక్ష రాజకీయాలతో ఈ రోజు వరకూ పెద్దగా పరిచయం లేదు. కానీ ఆయన పేరుని హై కమాండ్ కనుక అనుకుంటే రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. ఇక విజయనగరం ఎంపీ టికెట్ ని బొత్స సతీమణి ఝాన్సీరాణికి ఇస్తారని అంటున్నారు.
అయితే ఇవన్నీ ఊహాగానాలుగానే ఉన్నాయి. బొత్స వీటికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది అని అంటున్నారు. మరో వైపు హై కమాండ్ ఆలోచనలు చూస్తే ఎంపీ టికెట్ ఒక్కటే బొత్స ఫ్యామిలీకి ఇచ్చి చీపురుపల్లి టికెట్ ని విజయనగరం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కి ఇస్తారని అంటున్నారు. ఇక విజయనగరం రాజకీయాలలో ఇప్పటికే బొత్స మేనల్లుడు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఆయనకే పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా బొత్స రెస్ట్ లో ఉన్నారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంతో కోలుకుని తిరిగి వచ్చాక విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఒక స్పష్టత వస్తుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వైసీపీ హై కమాండ్ బొత్సకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆయన కోరుకున్న మేరకే జిల్లా రాజకీయాలను నడపాలని కూడా అనుకుంటోంది అని అంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రా బీసీలకు పెద్దగా ఉన్న బొత్స వేగంగా కోలుకుని రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలని అంతా కోరుకుంటున్నారు.