బొత్సకు క్లారిటీ వచ్చిందా ?
వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు క్లారిటీ వచ్చిందా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 1 July 2024 3:53 AM GMTవైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు క్లారిటీ వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. బొత్స సత్యనారాయణ వైసీపీ అధికారంలో ఉన్నపుడు జగన్ తో సన్నిహితంగా ఉన్న మంత్రులలో ఒకరు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కువగా టికెట్లు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో బొత్స హావా ఒక లెవెల్ లో సాగింది.
అయితే 2019లో వైసీపీని విజయనగరం జిల్లాలో టోటల్ గా గెలిపించి క్లీన్ స్వీప్ చేయించిన బొత్స 2024లో తనతో పాటు జిల్లాలో వైసీపీ ఓడిపోయినా ఏమీ చేయలేకపోయారు. ఇది రాజకీయ మహిమ. ఆనాడు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే 2024లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దాంతో బొత్స కూడా ఎన్నికల ఫలితాల మీద షాక్ కి గురి అయ్యారు
ఆ తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. అసలు బొత్స ఉన్నారా లేరా అన్నట్లుగానే కాలం సాగింది. ఏపీలో ఈ మధ్య కాలంలో ఏమి జరిగినా బొత్స నుంచి రియాక్షన్ ఏమీ లేదు. కానీ ఆదివారం ఆయన తీరిక చేసుకుని మీడియా ముందుకు వచ్చారు.
ఏపీలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో కలత చెందేలా చేశాయని ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్య విధానాలు ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. వీసీలను రాజీనామాలు చేయమని కోరడమేంటని ప్రశ్నించారు. వారిని గవర్నర్ నియమిస్తారని ఆయన అన్నారు.
వైసీపీ ఆఫీసులలోకి టీడీపీ నాయకులు వస్తున్నారని ప్రైవేట్ ఆస్తులలోకి చొరబడడానికి వారికి ఉన్న హక్కులు ఏమిటి అని ఆయన అంటున్నారు తమ పార్టీ అన్ని అనుమతులూ తీసుకుని పార్టీ ఆఫీసులు నిర్మిస్తోందని బొత్స చెప్పారు.
టీవీ డిబేట్లలో కొందరు రిటైర్డ్ ఉన్నతాధికారులు నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని బొత్స నిరసన వ్యక్తం చేశారు. ఈ రిటైర్డ్ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా జగన్ అధికారం నుంచి దిగిపోయాక మాట్లాడడం ఏ మేరకు సబబని బొత్స ప్రశ్నించారు.
ఇవన్నీ పక్కన పెడితే బొత్స వైసీపీ తరఫున మీడియా ముందు బలంగానే వాయిస్ వినిపించారు. అంతే కాదు ఆయన ఏపీలో ఇరవై రోజుల టీడీపీ పాలన మీద రివ్యూ లాంటిదే చేశారు. ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో బొత్స రానున్న రోజులలో యాక్టివ్ అవుతారని అంటున్నారు.
అయితే బొత్స మీద ఇప్పటిదాకా రకరకాలైన ప్రచారం సాగింది. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని అలాగే జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజమెంతో తెలియదు కానీ బొత్స వైసీపీలోనే కొనసాగుతారు అన్నది క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. టీడీపీలో సీనియర్లకు మెల్లగా పక్కకు జరగమని సూచిస్తున్నారు. జనసేన అయితే కొత్త వారితోనే ముందుకు సాగాలని చూస్తోంది. దీంతో సీనియర్ నేతలుగా ఉన్న వైసీపీ వారికి ఎక్కడా ప్రస్తుతానికి అయితే ఆఫర్లు లేవని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో వైసీపీ సీనియర్ల రాజకీయం ఎలా ఉంటుందో.