Begin typing your search above and press return to search.

విశాఖ నుంచి విపక్ష నేత...యాంటీ సెంటిమెంట్ డౌట్ కొడుతోందా ?

అదీ కాకుండా ఆయన పోటీకి దిగాలంటే ఈ పదవిని అడిగినట్లుగా కూడా అప్పట్లో ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 3:31 AM GMT
విశాఖ నుంచి విపక్ష నేత...యాంటీ సెంటిమెంట్ డౌట్ కొడుతోందా ?
X

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి రెండో ప్రతిపక్ష నేతగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులు అయ్యారు. ఇది అంతా ముందు నుంచి ఊహిస్తున్నదే. ఎందుకంటే బొత్స లాంటి సీనియర్ ని కేవలం ఎమ్మెల్సీగా ఉంచుకోరు. అదీ కాకుండా ఆయన పోటీకి దిగాలంటే ఈ పదవిని అడిగినట్లుగా కూడా అప్పట్లో ప్రచారం సాగింది.

మొత్తానికి అంతా అనుకున్నట్లుగానే జరుగిగింది. బొత్సను ప్రతిపక్ష నేతగా జగన్ నియమిస్తున్నట్లుగా ప్రస్తుతం శాసన మండలిలో ఆ పార్టీ తరఫున విపక్ష నేతగా ఉన్న లేళ్ళ అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన ప్రకటనతో నేడో రేపో దానికి సంబంధించిన ఆదేశాలను పార్టీ అధినాయకత్వం జారీ చేస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా శాసనమండలిలో ఉన్న లేళ్ళ అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ బొత్స కోసమే రాజీనామా చేసినట్లుగా చెప్పారు. బొత్స వంటి సీనియర్ కి ఆ పదవి ఇవ్వడం మంచిది అని అధినాయకత్వానికి సూచించినట్లుగా వెల్లడించారు. తాను వైసీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతలను చూసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

అప్పిరెడ్ది విషయం అలా ఉంచితే విశాఖ నుంచి శాసనమండలికి ప్రతిపక్ష నేతగా నెగ్గిన రెండవ వారు బొత్స అని చెప్పాలి. బొత్స కంటే ముందు దాడి వీరభద్రరావు శాసనమండలిలో టీడీపీ పక్షం నుంచి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన 2007 నుంచి 2012 వరకూ అయిదేళ్ల పాటు పనిచేశారు. దాడి కూడా స్థానిక సంస్థల కోటాలోనే ఎమ్మెల్సీ అయ్యారు.

ఇక దాడికి 2012లో మరోసారి ఎమ్మెల్సీకి చంద్రబాబు రెన్యూవల్ చేయలేదని ఆగ్రహించి అధినాయకత్వం తో విభేదించి వైసీపీలో చేరిపోయారు. అప్పట్లో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా వ్యవహరించేవారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ కంటే మండలి అపోజిషన్ లీడర్ కే ప్రోటోకాల్ లో అగ్ర తాంబూలం ఇస్తారు. శిలాఫలకాల మీద కూడా వారి పేరే ముందు రాసి ఆ తరువాతనే అసెంబ్లీ అపొజిషన్ లీడర్ పేరు రాస్తారు.

అలా చంద్రబాబు కంటే ఎక్కువ హోదానే నాడు దాడి అనుభవించారు. చివరికి ఆయన పార్టీకే దూరం అయ్యారు. బాబుకు రాజకీయంగా కొంత ఇబ్బంది కూడా కలిగింది. సీన్ కట్ చేస్తే బొత్స కూడా సీనియర్ నేత. ఆయన సైతం స్థానిక కోటా నుంచే ఎమ్మెల్సీ అయ్యారు. మండలిలో విపక్ష నేతగా ఉంటున్నారు. అప్పట్లో చంద్రబాబు మాదిరిగానే ఇపుడు జగన్ కూడా అసెంబ్లీలో విపక్షంలో ఉన్నారు. అయితే నాడు బాబుకు కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రతిపక్ష హోదా అయినా ఉండేది. జగన్ కి అది కూడా లేదు.

చూస్తే ప్రోటోకాల్ ప్రకారం మండలిలో అపోజిషన్ లీడర్ కి వాల్యూ ఎక్కువ. మరి జగన్ ఎలా తట్టుకుంటారో అన్న చర్చ అయితే ఉంది. బొత్స పదవీ కాలం మూడేళ్ళ మూడు నెలలకు పైగా ఉంది. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. దాంతో ఈ కీలక పదవి కూడా దక్కడంతో బొత్స వైసీపీలో ఇపుడు ఏకైక కేబినేట్ ర్యాంక్ కలిగిన నేతగా ఉన్నారు.

మరి విశాఖ నుంచి విపక్ష నేతగా చేసిన దాడి సొంత పార్టీకి ఎదురు నిలిచిన యాంటీ సెంటిమెంట్ ఉంది. బొత్స విషయంలో అది నిజం కాకూడదని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. కానీ ఇది రాజకీయం ఎపుడు ఏమి జగుతుందో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా విశాఖ నుంచి విపక్ష నేతలు రావడం మంచి పరిణామమే అని అంటున్నారు.