బౌన్సర్లు అంటే బలవంతులు కాదు !
మరీ ముఖ్యంగా చూస్తే కనుక టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ లో బౌన్సర్ల విషయం పదే పదే ప్రస్తావనకు వచ్చింది.
By: Tupaki Desk | 31 Dec 2024 4:30 PM GMTబౌన్సర్లు అన్నది ఇపుడు ఎక్కువగా చర్చకు వస్తున్న విషయం. మరీ ముఖ్యంగా చూస్తే కనుక టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ లో బౌన్సర్ల విషయం పదే పదే ప్రస్తావనకు వచ్చింది. బౌన్సర్లలో ఒకరు అయిన ఆంటోనీ మీద కేసు కూడా పెట్టారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడంతో అది పెద్ద కేసు అయింది. దాంతో ఏ వన్ నుంచి ఏ 18 దాకా చాలా మందిని ఈ కేసులో నిందితులుగా నమోదు చేశారు. అలా బౌన్సర్ గా ఉన్న అంటోనీ మీద కూడా కేసు పడింది.
దాంతో బౌన్సర్లు అంటే ఎవరు వారి గురించిన వివరాలు ఏమిటి అన్నది అంతా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. హైదరాబాద్ లో కోటి మంది దాకా జనాభా ఉంటే పది వేలమంది దాకా బౌన్సర్లు ఉన్నారు అన్నది ఒక ఉజ్జాయింపు లెక్క. ఈ బౌన్సర్లు ఎలా తయారు అవుతారు. దీనిని ఎలా వృత్తిగా ఎంచుకుంటారు అంటే వారు కొంతవరకూ శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు. అలాగే కరాటే వంటి వాటిలో శిక్షణ పొందుతారు.
ఒక విధంగా వీరు ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించేందుకు అవసరమైన తర్ఫీదుని తమకు తాముగా స్వయంగా పొందుతారు. బౌన్సర్ల వ్యవస్థ అన్నది హైదరాబాద్ వంటి చోట్ల పరిచయం అయింది 2000 తరువాతనే అని అంటున్నారు. అలా గడచిన పాతికేళ్లలో వారు పది వేల మంది దాకా తయారు అయ్యారు.
మొదట్లో అంటే 2000 ఆయా ప్రాంతాలలో అయిదారు వందల మంది దాకానే వీరు ఉండేవారు. దాంతో అప్పట్లో వీరికి రోజుకు వేయి నుంచి రెండు వేల రూపాయల వంతున పేమెంట్ దక్కేది. అయితే రాను రానూ వీరి సంఖ్య అధికంగా మారడంతో పాటు కాస్తా కండలు తిరిగిన యువత ఈ వృత్తిని ఎక్కువగా ఎంచుకోవడంతో మంది ఎక్కువ అయింది. దాంతో ఈ రోజుకు కూడా వరి దినసరి వేతనం అయితే గట్టిగా రెండు వేల రూపాయలుగానే ఉంటోంది అని చెబుతున్నారు.
ఇక వేలాదిమందిగా ఉన్నా వీరికంటూ ఒక ప్రత్యేకమైన యూనియన్ అన్నది లేదు. కొంతమంది వీరిని చేరదీసి వీఐపీల ఫంక్షనలకు పంపిస్తూ ఉంటారు. గతంతో పోలిస్తే వీరికి ఉపాధి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. నెలలో ఇరవై నుంచి పాతిక రోజుల పాటు ఉపాధి దొరుకుతోంది. ఎందుకంటే రాజకీయ సినీ సెలెబ్రిటీలు పూర్వం కంటే ఇపుడు ఎక్కువగా జనంలోకి వస్తున్నారు.
అదే విధంగా వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా జనాల్లోకి వచ్చినపుడు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. బౌన్సర్లను పెట్టుకోవడం అన్నది వీఐపీ స్టాటస్ గా కూడా మారుతోంది. ఇదిలా ఉంటే బౌన్సర్లుగా వెళ్లేవారికి ఆ వృత్తి కత్తి మీద సాము లాంటిదే అని అందులో పనిచేస్తున్న వారు చెబుతున్నారు
తమకు అప్పగించిన బాధ్యత ప్రకారం సదరు సెలిబ్రిటీని కంటికి రెప్పలా కాచుకోవడం మీద వీరు దృష్టి పెడతారు. ఆ సందర్భంలో అడ్డు వచ్చిన వారిని పక్కకు నెట్టేస్తారు. అది తమ వృత్తిలో భాగమే తప్ప ఎవరినీ తాము కోరి ఇబ్బంది పెట్టాలని చేయమని వారు చెబుతున్నారు.
ఇక కొన్ని సందర్భాలలో క్రౌడ్ ఎక్కువగా ఉండి తమకు కూడా గాయాలు తగులుతాయని ఒక్కోసారి చేతులు కాళ్ళూ కూడా విరిగిన సందర్భాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. కొన్ని చోట్ల రిస్క్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే తమకు యూనియన్ అంటూ లేకపోవడం తో పాటు తమ వృత్తికి అధికార గుర్తింపు కూడా లేకపోవడం వల్ల తామే నష్టపోతున్నామని అంటున్నారు. లేటెస్ట్ గా ఆంటోనీ అరెస్ట్ తో బౌన్సర్లుగా పనిచేసేవారు కూడా భయపడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో తమను తాము న్యాయపరంగా కాపాడుకోవడం కూడా కష్టసాధ్యం అని చెబుతున్నారు.
అయితే వీరంతా పెద్ద వారికి దగ్గర కావచ్చునని సినీ సెలిబ్రిటీలతో కలసి ఉండవచ్చునని ఈ వృత్తిలోకి వస్తున్నారు. ఎక్కువగా యువత ఈ వృత్తి పట్ల మోజు పడుతోంది. కానీ వీరికి సరైన ట్రైనింగ్ లేకపోవడంతో పాటు చట్టపరమైన అధికారాలు ఏవీ లేకపోవడం వల్ల వీరిని ఎంగేజ్ చేయడం తప్పు అన్నది కూడా ఇపుడిపుడే చర్చగా వస్తోంది.
అయితే పోలీసులు ఎంత ఎక్కువ మంది ఉన్నా పెరుగుతున్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కష్టమే అవుతోంది. అందువల్ల బౌన్సర్లలో శక్తి సామర్ధ్యాలు ఉన్న వారిని క్రౌడ్ ని అదుపు చేయగలిగే వారిని ఎంతో కొంత శిక్షణ ఇచ్చి సరైన తీరున ఉపయోగించుకుంటే బాగుంటుందని అంటున్నారు. వారి సేవలను వాలంటీర్ గానే తీసుకోవచ్చునని అవసరం అయిన చోట వీఐపీలకు వీరి ద్వారానే రక్షణ కల్పించేలా చేయవచ్చునని అంటున్నారు
వీరికి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే కనుక పోలీసులకు సహాయకారిగా ఉంటారు, అదే సమయంలో వారికి ఎంతో కొంత ఉపాధి దక్కుతుంది. వారిలో దురుసుతనం లేకుండా చేస్తే కనుక తొక్కిసలాటలు జరిగి ప్రజల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం తప్పుతుందని అంటున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఈ వృత్తిలోకి వస్తున్న యువత విషయంలో పాలకులు ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుందేమో చూడాలని సూచనలు వస్తున్నాయి.