తెలంగాణ పోలీస్.. సిరాజ్ తో క్రికెట్.. నిఖత్ తో బాక్సింగ్
ఇప్పుడు వీరి సేవలను పోలీస్ శాఖ సమర్థంగా వినియోగించుకోనుంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) విభాగంలో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ కేంద్రాలను నెలకొల్పనుంది.
By: Tupaki Desk | 6 Jan 2025 11:30 PM GMTఇద్దరూ చాంపియన్ ఆటగాళ్లే.. ఇద్దరూ పేదరికం నుంచి వచ్చినవారే.. ఇద్దరూ దేశాన్ని అమితంగా ప్రేమించే వారే.. పైగా ఇద్దరూ తెలంగాణ ప్రభుత్వంలో డీఎస్పీ (డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)లే. ఇలాంటి ఆ ఇద్దరి సేవలను తెలంగాణ పోలీసులు సమర్థంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ కప్ గెలిచిన ఏకైక క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. ఈ హైదరాబాదీ పేసర్ టీమ్ ఇండియాలో నాలుగైదేళ్లుగా రెగ్యులర్ సభ్యుడు. నిరుడు జూన్ లో టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన సిరాజ్.. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన జట్టులోనూ ఉన్నాడు. ఈ ఘనత మరే తెలుగు రాష్ట్రాల క్రికెటర్ కూ దక్కలేదు. హైదరాబాదీ స్టయిలిష్ బ్యాటర్ అయిన మొహమ్మద్ అజహరుద్దీన్ మూడు వన్డే ప్రపంచ కప్ లకు కెప్టెన్ గా ఉన్నప్పటికీ వీటిలో ఒక్కటీ గెలవలేదు. సాధారణ ఆటో డ్రైవర్ అయిన 30 ఏళ్ల సిరాజ్ మాత్రం మూడు ఫార్మాట్లలో ఫైనల్స్ (టి20, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్, వన్డే) ఆడిన ఘనత అందుకున్నాడు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ బాక్సింగ్ సంచలనం. అమ్మాయిలకు బాక్సింగా? అనే పరిస్థితుల నుంచి వచ్చిన ఆమె ప్రపంచ చాంపియన్ స్థాయికి ఎదిగింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్ లోనూ పాల్గొంది.
తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిని సిరాజ్, నిఖత్ లను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. వారికి హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు నగదు నజరానాలూ అందించింది. ఆపై డీఎస్పీలుగానూ నియమించింది. ఇప్పుడు వీరి సేవలను పోలీస్ శాఖ సమర్థంగా వినియోగించుకోనుంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) విభాగంలో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ కేంద్రాలను నెలకొల్పనుంది. సిరాజ్, నిఖత్ లు టీజీఎస్పీలోనే డీఎస్పీలు కావడంతో వారి సేవలను ఇలా వాడుకోనున్నారు.
క్రమశిక్షణతో ఉండే పోలీస్ శాఖలో సిరాజ్, నిఖత్ లతో శిక్షణ ఇప్పిస్తే గనుక ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.