ఇంత దారుణమా? బాలికను బంధించి 4 రోజులు 7గురి అమానుషకాండ
ఏపీలో మరో దారుణ ఉదంతం వెలుగు చూసింది. ప్రభుత్వాలు మారినా మహిళలపై జరిగే హింస మాత్రం మారటం లేదు.
By: Tupaki Desk | 19 March 2025 11:30 AM ISTఏపీలో మరో దారుణ ఉదంతం వెలుగు చూసింది. ప్రభుత్వాలు మారినా మహిళలపై జరిగే హింస మాత్రం మారటం లేదు. దారుణ నేరాలు కంట్రోల్ కాని దుస్థితి. తాజాగా వెలుగు చూసిన ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. బంధువుల ఇంటికి వచ్చిన బాలికను ఏడుగురు యువకులు నాలుగురోజులుగా టార్చర్ పెట్టేసిన వైనం షాకింగ్ గా మారింది. క్రిష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం పోలీసుల కథనం ప్రకారం జి.కొండూరుకు చెందిన పద్నాలుగేళ్ల బాలిక తమ ఇంటి పక్కన ఉండే మహిళతో కలిసి వీరపనేని గూడెం వచ్చింది.
సదరు మహిళకు సంబంధించి పుట్టింట్లో చోటుచేసుకున్న వివాదం గురించి వేరే వారికి చెప్పటం.. దీనిపై బాలిక తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆమెను గమనించిన పదిహేనేళ్ల బాలుడు.. మరొకరు (రజాక్) ఆమెను టూవీలర్ మీద జి.కొండూరుకు తీసుకెళతామని మాటలు చెప్పి నమ్మించారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను అనిల్.. జితేంద్ర అనే ఇద్దరి వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కేసరపల్లికి చెందిన అనిల్.. హర్షవర్దన్ వద్దకు తీసుకెళ్లగా.. వారితో పాటు మరొకరు కూడా కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.
చివరకు ఆ బాలికను సోమవారం ఆటోలో తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేశారు. మాట్లాడలేనిస్థితిలో ఉన్న ఆమెను గమనించిన ఒక ఆటో డ్రైవర్ ఆమెను మాచవరం పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ అప్పజెప్పారు. మరోవైపు తమ కుమార్తె కనిపించటం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ను సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. టూవీలర్ మీద ఆమెను తీసుకెళ్లిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. వీరు.. వీరితో పాటు మిగిలిన వారి దారుణాలు వెలుగు చూశాయి. దీంతో పోలీసులు.. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందన్న విషయంపై లోతుగా విచారిస్తున్నారు.