అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. స్ట్రాటజీ మార్చుకున్న బీఆర్ నాయుడు
కానీ.. ఎప్పుడైతే ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి తన స్ట్రాటజీని పూర్తిగా మార్చుకున్నారు.
By: Tupaki Desk | 25 Nov 2024 10:30 AM GMTటీవీ5 మీడియా అధినేత బీఆర్ నాయుడు మొన్నటివరకు పెద్దగా మార్కెట్లో ఎవరికీ తెలియదు. మీడియా అధినేత అయినప్పటికీ ఏనాడూ పెద్దగా మీడియాలో కనిపించలేదు. ఏనాడూ కెమెరా ముందుకు రాలేదు. పెద్దగా ప్రజలతోని కూడా ఆయనకు సంబంధాలు లేవు. కానీ.. ఎప్పుడైతే ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి తన స్ట్రాటజీని పూర్తిగా మార్చుకున్నారు.
బీఆర్ నాయుడు ఏనాడూ ఇంటర్వ్యూలు కానీ.. ఇతర కార్యక్రమాల్లో కానీ పెద్దగా కనిపించలేదు. తన చానల్ తరఫున కూడా ఎవరినీ ఇంటర్వ్యూ చేసిన దాఖలాలు లేవు. అసలు ఎక్కడా ప్రజలకు కనిపించిందే లేదు. మొన్న టీటీడీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఈయనేనా బీఆర్ నాయుడు అని ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు. టీటీడీ చైర్మన్ అయ్యాక చాలా వరకు మీడియాలో కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నాలుగు దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్నానని, ఎట్టకేలకు ఇటీవల తన ఆకాంక్ష సాకారమైందని చెప్పారు. తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, సీనియర్ ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించిన వెంటనే తాను చేరానని తెలిపారు. గత 42 ఏళ్లలో తాను ఒక్కసారి కూడా అధికారం అడగలేదని పేర్కొన్నారు.
గతేడాది జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో కలిసినట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా తన సేవలను అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఒక్క క్షణం ఆలోచించి దానికి అర్హుడినే అన్నట్లుగా బదిలిచ్చారని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేయడానికి ఇది తనకు లభించిన అవకాశం అని తెలిపారు. కాగా.. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే, బీఆర్ నాయుడు లడ్డూల నాణ్యతను పెంచడం, సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం పై దృష్టి సారించారు. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే.. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు చేయడం వంటి సంస్కరణలకు దిగుతున్నారు.