Begin typing your search above and press return to search.

రాజీవ్ విగ్రహం : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం !

మహా నాయకులు ఎవరూ తమ విగ్రహాలు పెడతారని ప్రజలకు మేలు చేయలేదు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 3:37 AM GMT
రాజీవ్ విగ్రహం : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం !
X

మహా నాయకులు ఎవరూ తమ విగ్రహాలు పెడతారని ప్రజలకు మేలు చేయలేదు. వారు పాలన చేసినది ప్రజా శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకునే. అయితే వారిని విగ్రహాలుగా మార్చడం అన్నది తరువాత తరం చేసే రాజకీయం. ఇందులో లాభాలు మైలేజీలు వగైరాలు ఎన్నో ఉంటాయి.

ఇపుడు తెలంగాణాలో చూస్తే మాజీ ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. నిజానికి రాజీవ్ గాంధీ మరణించి మూడున్నర దశాబ్దాల కాలం అయింది. ఆయన మరణం చెందిన సమయంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఉంది. అయితే అపుడు తట్టని ఆలోచనలు ఆ తరువాత 2004లో తట్టాయి.

వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇక పదేళ్ల పాటు రాజ్యమేలి తెలంగాణా ఏర్పాటు తరువాత కాంగ్రెస్ దిగిపోయింది. బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు.

ఇపుడు రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. అదేంటి అంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు. తెలంగాణా నూతన సచివాలయం ఎదుట రాజీవుని విగ్రహం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపలనలు సృష్టిస్తోంది. నిజానికి రాజీవ్ గాంధీ దేశానికి ప్రధానిగా అయిదేళ్ళ పాటు చేశారు. ఆయన చెన్నైలో మానవ బాంబు దాడిలో మరణించారు.

ఆయన విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాని కంటే ముందు చెప్పాల్సింది ఏంటి అంటే అద్భుతమైన సెక్రటేరియట్ ని కేసీఆర్ తన హయాంలో నిర్మించారు. కానీ అందులో ఆయన ఎక్కువ రోజులు పాలన చేయలేకపోయారు.

ఇపుడు అది కాంగ్రెస్ పాలనలోకి వచ్చింది. ఆ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత కీర్తిని అందుకునే ప్రయత్నం చేస్తోంది. బహుశా ఇదే మంట పుట్టించే వ్యవహారంగా బీఆర్ఎస్ కి మారింది అని అంటున్నారు.

దాంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే దీని మీద మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని ఆయన హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతే కాదు రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరుని సైతం తొలగిస్తామని కూడా అంటున్నారు.

దీంతో కాంగ్రెస్ వృద్ధ నేత వి హనుమంతరావు సీన్ లోకి వచ్చారు. అలా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అయినా విగ్రహాలను తొలగిస్తామనడం ఇదేమి రాజకీయమని ప్రశ్నించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణా తల్లి విగ్రహం పెట్టలేని వారు ఇపుడు రాజీవ్ విగ్రహం తాము పెడతామని అనగానే ఆ సంగతి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు.

రాజీవ్ గాంధీ అంటే ఎవరో కాదు కేసీఆర్ కే రాజకీయ బిక్షను పెట్టిన వారు అని ఫ్లాష్ బ్యాక్ ని కెలికారు వీ హనుమంతరావు. మొత్తానికి చూస్తే ఇది చిలికి చిలికి గాలి వాన వ్యవహారం అయ్యేలా ఉంది అని అంటున్నారు.

ఇది బీఆర్ఎస్ మరోసారి తెలంగాణా ఆత్మ గౌరవం అని ఎత్తుకోవడానికి ఉపయోగించుకునే ఆయుధంగా మారుతుందా లేక కాంగ్రెస్ గురుతులు మరింత బలంగా ఉంచి రాజకీయ మైలేజ్ ని సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా నేతలు నిగ్రహం కోల్పేయే విధంగా విగ్రహాల రాజకీయం మాత్రం ఉంది అని అంటున్నారు.