బ్రహ్మాజీ నోట 'జై జగన్ అన్న' మాట... తెరపైకి 'ఎక్స్' హ్యాక్ టాపిక్!
ఈ సమయంలో మరోసారి బ్రహ్మాజీ స్పందించారు.. తన ఎక్స్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చారు!
By: Tupaki Desk | 8 Sep 2024 5:37 AM GMTవిజయవాడలో వరదలు ముంచెత్తిన నేపథ్యంలో... రాజకీయంగా భారీ విమర్శల ప్రవాహాలూ పోటెత్తుతున్నాయి. ఈ సందర్భంగా... ఎక్స్ వేదికగా సుధీర్ఘ పోస్ట్ పెట్టిన వైసీపీ అధినేత జగన్... వరదలు ముంచెత్తి ఎనిమిది రోజులు అవుతున్నా సహాయక చర్యలు ఊపందుకోలేదని.. ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయని.. ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం అంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
ఇదే క్రమంలో... చంద్రబాబు ప్రచార ఆర్బాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొందని చెప్పిన జగన్... నాదెండ్ల మనోహర్ తో జరిగిన సంభాషణ వైరల్ అయ్యిందని చెబుతూ... ట్రాక్టర్లు రాక్పోవడం ఏమిటి.. 150 వాహనాలు మాత్రమే ఉండటం ఏమిటి.. 80 వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుని 15వేల మందికీ ఇవ్వలేకపోవడం ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
దీంతో... ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇది పూర్తిగా చంద్రబాబు సర్కార్ చేతకానితనమే అని ఒకరంటే... సహాయకచర్యల్లో భాగంగా బాబు ప్రభుత్వం బాగా స్పందించిందని, సహాయక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరిగాయని, బాబు స్వయంగా పర్యవేక్షించారని అంటున్నారు. ఈ సమయంలో సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు.
అవును... విజయవాడలోని వరదల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, విమర్శిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ అనంతరం.. నటుడు బ్రహ్మాజీ స్పందించారు. దీంతో... ఎక్స్ వేదికగా వైసీపీ వర్సెస్ బ్రహ్మాజీ అనే అంశం తీవ్ర స్థాయిలో జరిగింది! బ్రహ్మాజీని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. ఈ సమయంలో మరోసారి బ్రహ్మాజీ స్పందించారు.. తన ఎక్స్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చారు!
ఇంతకీ ముందుగా బ్రహ్మాజీ ఏమన్నారంటే... "మీరు కరెక్ట్ సర్.. వారు చెయ్యలేరు సర్.. ఇకనుంచి మనం చేద్దాం సర్.. ముందు మనం 1000 కోట్లు రిలీజ్ చేద్దాం సర్.. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం సర్.. గవర్నమెంట్ కాదు సర్.. మనం చేసి చూపిద్దాం సర్.. జై జగన్ అన్న" అని ట్వీట్ చేశారు.
ఇందులో వెటకారం ధ్వనించడం వల్లో ఏమో కానీ... ఈ ట్వీట్ అనంతరం బ్రహ్మాజీపై వైసీపీ కేడర్ విరుచుకుపడిపోయింది. ఈ సమయంలో బ్రహ్మాజీ ఎక్స్ ఖాతాలో ఈ ట్వీట్ డిలీట్ అయ్యింది. అనంతరం స్పందించిన బ్రహ్మాజీ... "నా ఎక్స్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ట్వీట్ చేశారు.. నాకు ఆ ట్వీట్ కి సంబంధం లేదు.. కంప్లైంట్ చేస్తాను" అని తెలిపారు. అయినప్పటికీ నెట్టింట కామెంట్స్ వార్ నడుస్తుంది.. ఇది ఎలా ముగుస్తుందనేది వేచి చూడాలి!