Begin typing your search above and press return to search.

బ్రహ్మ కమలం @ సీతా నగరం... ఎన్ని పూలో తెలుసా?

బ్రహ్మకమలం... హిమాలయాల్లో కనిపించే అరుదైన పుష్పజాతి. ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే ఈ పుష్పాన్ని బ్రహ్మదేవుడు అనుగ్రహించిన పుష్పం అని చాలామంది భావిస్తారు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 11:30 PM GMT
బ్రహ్మ కమలం @ సీతా నగరం... ఎన్ని పూలో తెలుసా?
X

బ్రహ్మకమలం... హిమాలయాల్లో కనిపించే అరుదైన పుష్పజాతి. ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే ఈ పుష్పాన్ని బ్రహ్మదేవుడు అనుగ్రహించిన పుష్పం అని చాలామంది భావిస్తారు. ఈ పువ్వు వికసించే రోజు కోసం ఎదురు చూస్తుంటారు. బ్రహ్మకమలం... సంతోషం, అదృష్టం, శ్రేయస్సు కలిగించడంతోపాటు.. ప్రతికూల శక్తుల నుండి గృహ యజమానిని రక్షించే పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. అత్యంత అరుదుగా కనిపించే ఈ పూలు తాజాగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వికసించాయి.

అవును... హిమాలయాలు పుట్టినిల్లయిన ఈ బ్రహ్మ కమలాన్ని చూస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక, ఈ పూలు ఇంటి ఆవరణలో వికసిస్తే అత్యంత మేలు జరుగుతుందని, అదృష్టం వరిస్తుందని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, వెదుళ్లపల్లి గ్రామంలోని చెరుకూరి వెంకటరత్నం గారి ఇంట్లో ఇంట్లో ఈ బ్రహ్మకమలం వికసించింది.

వాస్తవానికి జిల్లాకు మూడు, నాలుగు మాత్రమే కనిపించేలా అత్యంత అరుదుగా ఉండే ఈ మొక్క... సాధారణంగా ఒకటి, రెండు.. లేక, మూడు పూలు పూస్తుంటుంది. బాగా అరుదైన సందర్భాల్లో మాత్రమే అంతకు మించి వికసిస్తుంది. అయితే తాజాగా ఈ ఇంట్లో మాత్రం ఏకంగా 12 పూలు వికసించడం గమనార్హం. దీంతో.. ఆ కుటుంబం ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో ఈ పూలను దేవుడికి సమర్పించింది.

పురాణ రహస్యాలతో కూడిన‌ట్లు చెబుతున్న ఈ సొగసైన పుష్పం.. శతాబ్దాలుగా మాన‌వుల ఊహ‌ల్లో మాత్రమే కొన‌సాగింది. సామాన్య మానవుడికి దర్శించుకునే అవకాశం లేకపోయేది! అయితే గత కొంత‌కాలంగా కొంతమంది ఇళ్లలో ఈ అరుదైన బ్రహ్మ క‌మ‌లం మొక్కల‌ను అత్యంత జాగ్రత్తలతో, భక్తి శ్రద్ధలతో పెంచుతున్నారు. అవి వికసించినప్పుడు గమనించి చూడగలగడం కూడా అదృష్టంగా చెబుతున్నారు.

సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిఈంచే ఈ పూలను విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ దైవిక జ‌న‌నానికి సాక్షిగా పేర్కొంటారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వికసించే ఈ పువ్వు... తెల్లవారేసరికి వాడిపోతుంది. మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే.. ఈ బ్రహ్మకమలం వికసించినప్పుడు.. ఎవరైతే అది గ్రహించి, త‌మ కోరికలు ఆ పుష్పానికి చెబుతారో వారి మ‌న‌సులోని కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.

ఈ బ్రహ్మ కమలం మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో లేదా బ్రహ్మస్థానం మధ్యలో ఉంచాలని చెబుతుంటారు. ఇదే సమయంలో దీనికి పరోక్ష సూర్యకాంతి అవసరం అని గుర్తించుకోవాలి. విశ్వాసాల ప్రకారం.. బ్రహ్మ - విష్ణువు ఈ పుష్పం లోపల నివసిస్తారని.. ఫలితంగా... ఇంటి నుండి ప్రతికూల శక్తులను తొలగించడానికి, సానుకూల శక్తులను ఆహ్వానించడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, వెదుళ్లపల్లి గ్రామంలోని చెరుకూరి వెంకటరత్నం గారి ఇంట్లో ఈ బ్రహ్మకమలం వికసించింది. దీంతో... వాటికి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచుకుంటూ.. ఆ పూలలోని దైవత్వాన్ని వివరిస్తూ... భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పూజలు చేస్తున్నారు.