బాల్టిమోర్ వంతెన ఘటన.. అమెరికాకు ఎంత నష్టమో తెలుసా?
అమెరికాలోని బాల్టిమోర్ లో ఒక నౌక ఢీకొని వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 April 2024 12:30 PM GMTఅమెరికాలోని బాల్టిమోర్ లో ఒక నౌక ఢీకొని వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. అదృష్టవసాత్తు ఆ ఘటన అర్ధరాత్రి దాటిన తర్వాత జరగడంతో ఎక్కువ ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు! ఈ సమయంలో ఆ ఘటనపై తాజాగా మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈ వంతెన కూలడం వల్ల అమెరికాకు వచ్చిన కష్టం, నష్టం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈ ఘటనను "జాతీయ ఆర్థిక విపత్తు"గా అభివర్ణించడం గమనార్హం.
అవును... అమెరికాలోని బాల్టిమోర్ లో ఒక నౌక ఢీకొని వంతెన కూలిపోయిన ఘటనపై మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ స్పందించారు. ఇందులో భాగంగా... అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటైన బాల్టిమోర్ నుంచి గతేడాది సుమారు 11 లక్షల కంటైనర్లు వెళ్లాయని అన్నారు. ఇందులో భాగంగా.. కార్లు, ట్రక్కులు, వ్యవసాయ పరికరాలు, మొదలైన వాటి ఎగుమతులకు దేశవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఓడరేవని తెలిపారు.
అటువంటి నౌకాశ్రయంలో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. అయితే ఈ ప్రబ్భావం కేవలం మేరీల్యాండ్ కే పరిమితం కాదని.. ఒహైయోలో ఆటో డీలర్లు, కెంటకీలో వ్యవసాయదారులు, టెనస్సీలోని రెస్టారెంట్లపైనా దీని ప్రభావం పడుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంతో కీలకమైన ఈ నౌకాశ్రయంలో వీలైనంత త్వరగా రాకపోకలు పునరుద్ధించడం అవసరం అని వెస్ మూర్ తెలిపారు.
ఇదే సమయంలో.. ప్రమాదానికి కారణమైన ఆ నౌకపై సుమారు నాలుగు వేల టన్నుల బరువైన వంతెన శకలాలు ఉన్నాయని.. దీంతో అది అక్కడే చిక్కుకుపోయిందని.. ఈ వంతెన శకలాలను తొలగించేంందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారని.. సుమారు ఈఫిల్ టవర్ అంత పొడవైన ఆ నౌకును తరలించడం అతంత సవాల్ తో కూడుకున్న పని అని వెస్ మూర్ తెలిపారు.
కాగా... మార్చి 25 అర్ధరాత్రి దాటిన తర్వాత.. నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రమాదానికి ముందే నౌకలోని సిబ్బంది.. అధికారులను అప్రమత్తం చేయడంతో వంతెనపై రాకపోకలను నిలిపేయగలిగారు. ఫలితంగా ఎన్నో ప్రాణాలు కాపాడగలిగారు!