Begin typing your search above and press return to search.

బ్రిటన్ లో స్తంభించిన విమానయానం... నాట్స్‌ లేటెస్ట్ క్లారిటీ ఇది!

అవును... బ్రిటన్‌ లో సాంకేతిక లోపం తలెత్తి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థపై ప్రభావం పడటంతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:59 AM GMT
బ్రిటన్  లో స్తంభించిన విమానయానం... నాట్స్‌  లేటెస్ట్  క్లారిటీ ఇది!
X

బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌ వర్క్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యతో యూకే గగనతలం మూసివేయాల్సి వచ్చింది. దీంతో వందల విమానాలు ఇబ్బందులను ఎదుర్కోగా వేల మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు! అయితే ఈ విషయాలపై బ్రిటన్‌ జాతీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌ (నాట్స్‌) వివరణ ఇచ్చింది.

అవును... బ్రిటన్‌ లో సాంకేతిక లోపం తలెత్తి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థపై ప్రభావం పడటంతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో ప్రయాణంలో ఉన్న విమానాలను సురక్షితంగా దిగేందుకు ట్రాఫిక్‌ ఫ్లో నిబంధనలను అమలు చేశామని నాట్స్ వెల్లడించింది.

ఇదే సమయంలో సమస్య పరిష్కారమయ్యేవరకూ మాన్యువల్‌ గా విమానాలను క్రమబద్ధీకరించామని పేర్కొంది. అయితే ఆటోమేటిక్‌ వ్యవస్థ అంత వేగంగా క్రమబద్ధీకరించలేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించింది. ఈ సందర్బగా... ప్రతి విమానం సురక్షితంగా దిగాలనేదే తమ లక్ష్యమని నాట్స్ తెలిపింది.

కాగా... సెలవులను ముగించుకుని తిరిగి విధుల్లో చేరేందుకు బ్రిటన్‌ వాసులు తరలిరావడంతో సోమవారం విమానాశ్రయాలన్నీ కిటకిటలాడాయి. సరిగ్గా అదే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాల ప్రణాళిక ప్రభావితమైంది.

అయితే బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ విఫలమైనట్లు ముందుగా... స్కాటిష్‌ ఎయిర్‌ లైన్‌ లోగాన్‌ ఎయిర్‌ గుర్తించింది. అనంతరం విమాన ప్రయాణాల ఆలస్యం, రద్దుపై బ్రిటన్‌ తోపాటు ఐరోపా వ్యాప్తంగా ఎయిర్‌ పోర్టుల్లో ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి.

దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ పోర్టులు, విమానాల్లో చిక్కుకున్న ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు.

అయితే తాజా ప్రకటన ప్రకారం... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సమస్య వల్ల ప్రస్తుతానికి బ్రిటన్ వ్యాప్తంగా విమానాల ల్యాండింగ్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. విమానాల టేకాఫ్ లను అనుమతించడం లేదని తెలుస్తోంది.

అయితే వీలైనంత త్వరగా ఈ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు.