తాజా ఇష్యూ: బ్రిటన్ లో ఒంటి రంగు చూసి దాడి చేస్తున్నారు
బ్రిటన్ లో కొత్త రచ్చ మొదలైంది. ఒంటి రంగును చూసి దాడులు చేసే దుర్మార్గం అక్కడ అంతకంతకూ ఎక్కువైంది
By: Tupaki Desk | 5 Aug 2024 5:21 AM GMTబ్రిటన్ లో కొత్త రచ్చ మొదలైంది. ఒంటి రంగును చూసి దాడులు చేసే దుర్మార్గం అక్కడ అంతకంతకూ ఎక్కువైంది. దాదాపు వారం క్రితం సౌత్ పోర్టులో ముగ్గురు చిన్నారులు కత్తిపోట్లకు బలైన అనంతరం.. వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. ఒంటి రంగును చూస్తున్న స్థానికులు.. వలస ప్రజలను టార్గెట్ చేయటం.. వారిపై దాడులకు దిగటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ గొడవలకు ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థ కారణంగా భావిస్తున్నారు.
అతివాదంతో ఉండే వీరు.. వలసవాదులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. చివరకు వారు బస చేసే హోటళ్లను సైతం విడిచిపెట్టటం లేదు. వలసవాదుల్ని టార్గెట్ చేస్తున్న వైనం ఇప్పుడు కొత్త ఆందోళనకు తెర తీసింది. వలసలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చే సంస్థలకు స్థానికుల మద్దతు ఉందని భావిస్తున్నారు
ఈ సమస్య ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా బ్రిటన్ మొత్తం హింసాత్మక ఘటనలు పెరగటంతో వలసవాదుల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. అయితే.. ఈ తరహా హింసాత్మక చర్యల్ని ప్రభుత్వం ఖండిస్తోంది. అతివాదుల్ని కంట్రోల్ చేసే పోలీసులపైనా ఆందోళనకారులు దాడులకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు వందకు పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లివర్ పూల్.. హల్.. బ్రిస్టల్.. లీడ్స్.. బ్లాక్ పూల్.. స్టోక్ ఆన్ ట్రెంట్.. బెల్ ఫాస్ట్.. నాటింగ్ హోమ్.. మాంచెస్టర్ లలో వలసవాదులు ఉండే హోటళ్ల మీద ఆందోళనకారులు దాడులకు దిగారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి కెయిర్ స్టార్మర్ సీరియస్ అయ్యారు. ఈ తరహా అతివాద చర్యల్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆదేశించారు. నేరాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా ఉండాలని.. ఇలాంటి వారు తగిన మూల్యం చెల్లిస్తారంటూ హోం మంత్రి వివెట్ కూపర్ సైతం హెచ్చరిస్తున్నారు.
వలసవాదులపై దాడులకు పాల్పడుతున్న ఆందోళకారులు.. కొన్ని షాపులకు సైతం నిప్పు పెట్టారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే హోటళ్ల మీదా దాడులు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరిపోతోంది. ఈ అంశాన్ని బ్రిటన్ సర్కారు సీరియస్ గా తీసుకొంటోంది. కానీ.. దాడుల్ని నిలువరించే విషయంలో ఫెయిల్ అవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.