మథురలో ఆ మసీదు గుడిని కూల్చి కట్టిందే.. 1920 నాటి గెజిట్ చెప్పిందిదే!
తాజాగా యూపీలోని మొయిన్ పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఒక కీలక ప్రభ్నను సందించారు.
By: Tupaki Desk | 5 Feb 2024 5:08 AM GMTమొఘల్ చక్రవర్తుల పాలనలో వివిధ ఆలయాల్ని కూల్చేసి మసీదులు కట్టినట్లుగా చెప్పే వాదనలో కొంత నిజం ఉందన్న విషయం తాజాగా వెల్లడవుతున్న వివరాలు స్పష్టం చేస్తున్నాయి. వివాదంగా మారిన మథురలోని మసీదు విషయంపై తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఇచ్చిన వివరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మథురలోని శ్రీక్ఱిష్ణ జన్మభూమి ఆలయాన్ని కూల్చేసి.. ఆ స్థానంలో షాహీ ఈద్గా మసీదును కట్టించినట్లుగా పురావస్తు శాఖకు చెందిన అగ్రా విభాగం వెల్లడించింది. తన వాదనకు బలం చేకూరేలా 1920లో నాటి బ్రిటిష్ సర్కారు వారి గెజిట్ ను చూపిస్తున్నారు.
తాజాగా యూపీలోని మొయిన్ పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఒక కీలక ప్రభ్నను సందించారు. ఇంతకు ఆ ప్రశ్నేమిటంటే.. మథురలో కనిపించే మసీదును గతంలో ఆలయాన్ని కూల్చేసి కట్టారా? అని. దీనికి బదులుగా సమాధానం ఇస్తూ.. ఆలయం కూల్చిన చోటే మసీదు కట్టినట్లుగా స్పష్టమవుతుందని పేర్కొన్నారు. 1920లో బ్రిటిష్ సర్కారు ప్రచురించిన రాజపత్రాన్ని ఏఎన్ఎ తన సమాధానంలో వెల్లడించింది.
అందులో మథురలోని ఆలయాన్ని కూల్చేసి మసీదును కట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ అంశంపై శ్రీక్రిష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు ప్రముఖ లాయర్ మహేంద్రప్రతాప్ స్పందిస్తూ.. పురావస్తు శాఖ అందించిన సమాచారాన్ని ఈ కేసులో సాక్ష్యంగా హైకోర్టుకు.. సుప్రీంకోర్టును సమర్పిస్తామని వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం కొందరు హిందువులు మథురలోని మసీదు ప్రాంతం శ్రీక్రిష్ణుడి జన్మస్థలంగా పేర్కొనటం తెలిసిందే.
అక్కడి ఆలయాన్ని కూల్చేసిన మొఘల్ పాలకుడు ఔరంగజేబు.. దాన్ని కూల్చేసి.. దాని స్థానంలో మసీదును నిర్మించారని.. ఇప్పుడా మసీదును తొలగించి.. ఆ స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ మొత్తం13.37 ఎకరాల స్థలం వివాదంలో ఉండగా.. అందులో 10.9 ఎకరాల్లో ఆలయం ఉండగా.. రెండున్నర ఎకరాలపై మసీదుకు హక్కులు ఉన్నాయి. ఆ భూమి కూడా హిందూ ఆలయానిదే అన్నది వారి వాదన. తాజాగా పురావస్తుశాఖ వారు అందించిన పత్రం.. కోర్టు తుది నిర్ణయం తీసుకోవటానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.