బ్రిటన్ అంటే.. భారత్ కాదు.. దోచుకుని దాక్కోడానికి: బ్రిటన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 13 Aug 2023 4:02 PM GMTఅగ్రరాజ్యం బ్రిటన్ అంటే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారత సంతతి వ్యక్తి సునాక్ దేశ ప్రధానిగా ఉన్నారు. పైగా భారత్-బ్రిటన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. తాజాగా భారత్‌లో పర్యటించిన బ్రిటన్ హోం శాఖ మంత్రి టామ్ టుగెంధట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``బ్రిటన్ అంటే.. భారత్ కాదు.. బ్యాంకుల నుంచి సొమ్మును దోచుకుని దాక్కోవడానికి`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దోషులు దాక్కోవడానికి కూడా బ్రిటన్ అనువైన దేశం కాదని తేల్చి చెప్పారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు.. తమ దేశంలో ఉన్నారని భారత్ చెబుతోందని.. అయితే... బ్రిటన్‌లో అలాంటి వారు దాక్కోలేరని.. ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావాల్సిందేనని చెప్పారు. అంతేకాదు.. ఇలా జరిగేందుకు కొన్ని న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారత్, బ్రిటన్ దేశాలకు నిర్దిష్ట న్యాయ ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు. బ్యాంకు రుణాల ఎగవేతదారులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ప్రస్తుతం బ్రిటన్‌లో తల దాచుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ సర్కారును కోరుతోంది.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన జీ20 యాంటీ కరప్షన్ మినిస్టీరియల్(అవినీతి వ్యతిరేక మంత్రిత్వ) సమావేశంలో బ్రిటన్ హొం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఆయనను ఇంటర్వ్యూ చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి అనేక మంది ఆర్థిక నేరగాళ్లు బ్రిటన్‌లో ఉన్నారని, వారిని భారత దేశానికి పంపించాలని భారత ప్రభుత్వం కోరుతున్న విషయంపై బ్రిటన్ మంత్రి స్పందించారు.
దీనిపై టామ్ స్పందిస్తూ, చట్టం నుంచి తప్పించుకుని దాక్కోవడానికి అనువైన చోటుగా ఉండాలనే ఉద్దేశం బ్రిటన్‌కు లేదన్నారు. భారత్, బ్రిటన్‌లకు నిర్దిష్టమైన న్యాయ ప్రక్రియలు ఉన్నాయని, వాటిని పాటించడం తప్పనిసరి అని చెప్పారు. కాగా, కింగ్ ఫిషర్ పేరుతో లిక్కర్ వ్యాపారం చేసిన విజయ్ మాల్యా దాదాపు రూ.9,000 కోట్లు బ్యాంకు రుణాలను ఎగవేసి, 2016లో బ్రిటన్ పారిపోయారు. అదేవిధంగా నీరవ్ మోడీ వజ్రాలవ్యాపారం చేసి దాదాపు 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు. ఆయన కూడా బ్రిటన్‌లోనే దాక్కున్నారు.