Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్‌లో విప్లవం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్న రేవంత్ ప్రభుత్వం.. ఇంటర్‌నెట్‌లో కొత్త విప్లవానికి నాంది పలుకబోతున్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 10:58 AM GMT
ఇంటర్నెట్‌లో విప్లవం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
X

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్న రేవంత్ ప్రభుత్వం.. ఇంటర్‌నెట్‌లో కొత్త విప్లవానికి నాంది పలుకబోతున్నారు. కేవలం రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగానూ గ్రామీణ ప్రాంతాల్లో రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లకు దశలవారీగా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ కనెక్షన్ తీసుకోవడం వల్ల నెట్‌వర్క్‌తోపాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను ప్రజలు చూసే వీలు ఏర్పడుతుంది. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 గ్రామపంచాయతీల్లో దీనిని అమల్లోకి తీసుకురానున్నారు.

ఈ కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.2,500 కోట్లను కేటాయించింది. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించనున్నారు. అయితే.. టీ ఫైబర్ ద్వారా దీనిని అమల్లోకి తీసుకురాబోతున్నారు.

ఈ కనెక్షన్ తీసుకోవడం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్‌గానూ వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇస్తుండగా.. దీని ద్వారా చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కూడా ఈ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఇలా స్కూళ్లలో ఇవ్వడం ద్వారా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే.. ప్రతీ గ్రామంలోనూ జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్‌తో వాటిని అనుసంధానిస్తారు. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేస్తారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటితోపాటు డిజిటల్ సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఆ సంస్థ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు.