Begin typing your search above and press return to search.

జమిలికి వైసీపీ బీఆర్ఎస్ సై ?

మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ వైసీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమి వైపు లేకుండా తన తటస్థ విధానాలను కొనసాగిస్తూ జమిలికి జై కొడుతున్నారు ఇది అంతిమంగా ఎన్డీయేకు లాభం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:50 AM GMT
జమిలికి వైసీపీ బీఆర్ఎస్ సై ?
X

జమిలి ఎన్నికల విషయంలో దేశంలో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ బిల్లుకి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అర్హత లేదని కూడా గట్టిగా వాదిస్తున్నాయి. ఈ బిల్లు ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమని కూడా స్పష్టం చేస్తున్నాయి.

ఈ బిల్లు లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రచ్చ సాగింది. ఈ బిల్లుని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే, శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ కూడా జమిలి వద్దు అని స్పష్టం చేసింది.

మొత్తం మీద ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అయితే బిల్లుని సభలో ప్రవేశపెట్టి జేపీసీకి పంపించందుకు డివిజన్ కు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు.ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడంతో పాటు జేపీసీకి కూడా చర్చకు వెళ్తుంది అన్న మాట.

ఇదిలా ఉంటే పార్లమెంట్ లో తటస్థ పార్టీలు ఉన్నాయి. లోక్ సభలో వాటికి 11 ఎంపీలు ఉన్నారు. లోక్ సభలో వైసీపీకి ఆ విధంగా నలుగురు ఎంపీలు ఉన్నారు. వైసీపీ అయితే జమిలి ఎన్నికలకు మద్దతుగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కీలక నాయకుడు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని తరచూ చెబుతున్నారు.

తొందరగా ఎన్నికలు వస్తే తమ పార్టీకి మరో చాన్స్ దక్కుతుందన్న ఆశ వైసీపీలో ఉంది. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని అందువల్ల తమకు కలసి వస్తుందని కూడా భావిస్తోంది. అందుకే జమిలిని వైసీపీ గట్టిగా కోరుకుంటోంది.

మరో వైపు చూస్తే బీఆర్ఎస్ కి లోక్ సభలో ఒక్క ఎంపీ కూడా లేరు. కానీ రాజ్యసభలో ఉన్నారు. ఆ పార్టీ సైతం జమిలికి మద్దతుగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే జమిలి వస్తే తెలంగాణాలో మరోసారి గులాబీ జెండా పాతవచ్చు అన్నది ఆ పార్టీ ఆలోచన అంటున్నారు.

మొత్తానికి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అయితే తన సొంత రాజకీయం కోసం జమిలి ఎన్నికలను కోరుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఏపీలో టీడీపీ జనసేన జమిలికి మద్దతు ఇస్తున్న వేళ వైసీపీ కూడా జై కొట్టడం అంటే ఎన్డీయే విధానాలకు మద్దతు ఇస్తున్నట్లే అని అంటున్నారు. ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అన్న ప్రచారం ఒక వైపు ఉంది. అలాగే మమతా బెనర్జీ కొత్త కూటమికి ఏర్పాటు చేస్తే అందులో చేరడానికి కూడా వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

కానీ వైసీపీ జమిలి వైపు చూస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే జమిలి ఎన్నికల బిల్లునే లోక్ సభలో ప్రవేశ పెట్టవద్దు అంటోంది. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ వైసీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమి వైపు లేకుండా తన తటస్థ విధానాలను కొనసాగిస్తూ జమిలికి జై కొడుతున్నారు ఇది అంతిమంగా ఎన్డీయేకు లాభం అని అంటున్నారు. మరి నిజంగా ముందస్తుగా అంటే 2027లో జమిలి ఎన్నికలు జరగకపోతే వ్రతం చెడి ఫలం దక్కని తీరున అటు ఎన్డీయేకి ఇటు ఇండియా కూటమికి కాకుండా పోయే ప్రమాదం ఉందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.