Begin typing your search above and press return to search.

దొరికిన భట్టి, బండి.. ఏసుకుంటున్న బీఆర్ఎస్

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తాయి.

By:  Tupaki Desk   |   6 Sep 2024 9:20 AM GMT
దొరికిన భట్టి, బండి.. ఏసుకుంటున్న బీఆర్ఎస్
X

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తాయి. దాంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. చాలా కుటుంబాలు ఆశ్రయం కోల్పోయి నిరాశ్రయులుగా మారాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టమూ సంభవించింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఇద్దరు అపోజిషన్ లీడర్లు ఒకే హెలికాప్టర్‌లో ప్రయాణం చేశారు.

భారీ వరదలు ఖమ్మం నగరాన్ని ముంచెత్తాయి. అక్కడ పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. దీంతో అక్కడి నష్టాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్షాల నేతలు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పటికే మంత్రులు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తుండగా.. ఈ రోజు బీజేపీ నేతలు కూడా వెళ్లారు.

అలాగే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఏరియల్ సర్వే చేశారు. అతనితో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సర్వేలో పాల్గొన్నారు. వీరితోపాటే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.

అయితే.. ముగ్గురు కలిసి ఒకే హెలికాప్టర్‌లో బయలుదేరడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు దొరకని హెలికాప్టర్లు.. నేతలు తిరిగేందుకు మాత్రం వచ్చాయా అని నిలదీస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం అయ్యారని విమర్శిస్తున్నారు. సహాయార్థం రాని హెలికాప్టర్ నేతల పర్యటనకు ఎలా వచ్చిందని అడుగుతున్నారు. ఇక.. ఒకే హెలికాప్టర్‌లో ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పయనించడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సీన్ చూసి.. ఆ రెండు పార్టీలే ఒకటేనని మరోసారి నిరూపితం అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ వారు ముందు నుంచి ఆరోపిస్తున్నట్లుగా ఇప్పుడు బీజేపీ మంత్రులు, డిప్యూటీ సీఎం కలిసి ప్రయాణించడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరోసారి వారికి ఛాన్స్ ఇచ్చినట్లు అయింది. ఈ కామెంట్స్ నుంచి ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.