రేవంత్ మీద జలాస్త్రాన్ని ప్రయోగించిన గులాబీ పార్టీ!
అయితే నీరు చల్లగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. నీటిలో మంటలు పుట్టించగలదు. దానికి రాజకీయం తోడు అయితే ఇక కాక రేగడం ఖాయం.
By: Tupaki Desk | 24 Jan 2025 4:09 PM GMTనీరు ఎపుడు నిశ్చలంగా ఉండదు. అది నిరంతరం పారుతుంది. అలాగే రాజకీయాలు కూడా నిరంతరం సాగే నది లాంటివి. అయితే నీరు చల్లగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. నీటిలో మంటలు పుట్టించగలదు. దానికి రాజకీయం తోడు అయితే ఇక కాక రేగడం ఖాయం.
గులాబీ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినపుడు నీరు నిధులు ఉపాధి అంటూ సెంటిమెంట్ తోనే పోరాడింది. అంతే కాదు ఏపీ నుంచి తెలంగాణా విడిపోతేనే తప్ప న్యాయం జరగదు అని కూడా చెప్పుకొచ్చింది. అలా ఉద్యమంలో విజయవంతం అయింది.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఆ పార్టీ మీద భారీ స్థాయిలో ఉద్యమించింది. మళ్ళీ ఇపుడు కాంగ్రెస్ తెలంగాణ లో అధికారంలో ఉంది. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద జలాస్త్రాన్ని గట్టిగా ప్రయోగిస్తోంది.
దానికి తాజాగా బీఆర్ఎస్ కి చెందిన కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలే నిదర్శనంగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం గోదావరి నీటిని తరలించుకుని పోతూంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చోద్యం చూస్తోందని హరీష్ రావు ద్వజమెత్తారు.
ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 330 టీఎంసీల వరద నీరు గోదావరి పెన్నా నదుల నుంచి తీసుకుని పోతామని ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే తాము గట్టిగా అడ్డుకున్నామని హరీష్ రావు చెప్పారు.
ఆ విషయంలో నాటి టీడీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున అన్ని వేదికల మీద పోరాటం చేశామని ఆయన చెప్పారు. గోదావరి వాటర్ బోర్డుతో పాటు జలవనరుల విభాగం తోనూ ఆలాగే కీలక శాఖల వద్ద గట్టిగా తాము పోరాడితేనే ఆ ప్రాజెక్ట్ ఆగిందని అన్నారు అయితే ఇపుడు మళ్ళీ గోదావరి నీటిని ఏపీ ప్రభుత్వం లాగేసుకుంటోంది అని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దానిని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చిత్తగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఅర్ ఆనాడు తీసుకున్న సీరియస్ స్టెప్స్ ఇపుడు కాంగ్రెస్ హయాంలో ఎక్కడా కనిపించడం లేదు అని అన్నారు. ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గోదావరి నీళ్ళను తీసుకుని పోయే ప్రయత్నం చేస్తూంటే కనీసం ఉత్తరం కూడా సంబంధిత శాఖలకు రాయలేదని హరీష్ రావు మండిపడ్డారు.
మొత్తానికి చూస్తే నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీకి తెలంగాణాకు పేచీకి బీఆర్ఎస్ ఒక అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా ఉంది అని అంటున్నారు నీరు అన్నది సెంటిమెంట్ కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పడుతుందా అన్న చర్చ కూడా వస్తోంది. దావోస్ నుంచి భారీ పెట్టుబడులు తీసుకుని వచ్చిన సంతోషంలో ఉన్న రేవంత్ రెడ్డికి గుమ్మలోనే బీఆర్ ఎస్ ఈ సరికొత్త సవాల్ ని విసిరింది. మరి దీని మీద ఆయన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసూంటుంది అన్నది చూడాల్సి ఉంది.