Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీలో కొత్త గుబులు రేపిన దానం

ఇక బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 5:30 PM GMT
గులాబీ పార్టీలో కొత్త గుబులు రేపిన దానం
X

తెలంగాణాలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కి అది ఎంత కష్టతరమైన బాధ్యతో తెలిసి వస్తోంది. ఓటమి చెంది పది నెలలు అవుతోంది. పార్టీ గ్రాఫ్ మాత్రం ఎక్కడా పెరగడం లేదు. అదే సమయంలో క్యాడర్ నిస్తేజంలో ఉంది. కేసీఆర్ అయితే ఫాం హౌస్ కే పరిమితం అవుతున్నారు.

పార్టీలోని నాయకులు తలో దారీ చూసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు. అలా ఇప్పటికే అరడజన్ మంది దాకా చేరిపోయారు. ఇపుడు చూస్తే అది కొంత ఆగింది. దేనికి అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ల మేరకు అని అంటున్నారు.

ఆ మేరకు బీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేల గోడ దూకుడు మీద స్పీకర్ ఇచ్చిన ఫిర్యాదు మీద ఆయన స్పందనను తెలియచేయాల్సి ఉంది. దాంతో దీని మీదనే గులాబీ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. అయితే స్పీకర్ తన స్పందనను తెలియచేస్తూ కోర్టుకు అన్నీ తెలియచేస్తారు అని అంటున్నారు

దాంతో ఈ వ్యవహారం ఏదో తేలిన తరువాత మరింత మంది గులాబీ పార్టీ నుంచి గోడ దూకుడుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన నేతలు అంటున్నారు. దీని మీద బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన దానం నాగేందర్ మాట్లాడుతూ తమపైన హైకోర్టులో నడుస్తున్న కేసుని బూచిగా చూపించి కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అగ్ర నేతలు ఆపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే వారంతా కొంత లేట్ అవవచ్చు కానీ చేరేది మాత్రం పక్కాగా కాంగ్రెస్ పార్టీలోనే అని ఆయన జోస్యం చెబుతున్నార్. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని దానం నాగేందర్ అన్నారు.

వారిని కాంగ్రెస్ లో చేరకుండా ఎవరూ ఆపలేరని కూడా దానం బల్లగుద్దుతున్నారు. ఈ రకంగా దానం మాట్లాడడం ద్వారా గులాబీ పార్టీలో కొత్త గుబులు రేపారని అంటున్నారు. నిజానికి కోర్టు డైరెక్షన్ తో కొంత ఊరట చెంది ఊపిరి పీల్చుకుంటున్న బీఆర్ఎస్ కి దానం తాజా కామెంట్స్ టెన్షన్ ని పుట్టిస్తున్నాయని అంటున్నారు.

ఎందుకంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బారి నుంచి కాచుకోలేక ఆ పార్టీ సతమతం అవుతోంది. మరో వైపు చూస్తే మరి కొద్ది నెలలలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు ఉన్నాయి. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి చూస్తుంది. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది అని అంటున్నారు.

కాంగ్రెస్ గత ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో రూరల్ సెక్టార్ లో గెలిచి మంచి విజయం సాధించింది కానీ జీహెచ్ఎంసీలో మాత్రం పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇపుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి విజయం చాలా అవసరం.

అందుకే బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం కూడా ఖాయమని అంటున్నారు. దానం చేసిన కామెంట్స్ ని ఆ విధంగానే చూడాలని అంటున్నారు. సో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం నుంచి బీఆర్ఎస్ తప్పించుకోవడం కష్టమే అని అంటున్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తే మాత్రం అది గులాబీ పార్టీకి పెను సవాల్ గా మారుతుంది అని అంటున్నారు.

అయితే గతంలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా బీఆర్ఎస్ చేసింది అని గుర్తు చేస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.