Begin typing your search above and press return to search.

ఆటో నడుపుతూ అసెంబ్లీకి.. హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   18 Dec 2024 8:19 AM GMT
ఆటో నడుపుతూ అసెంబ్లీకి.. హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. నిన్న చేతికి సంకెళ్లు వేసుకొని సమావేశాలకు వచ్చిన సభ్యులు.. నేడు ఆటో డ్రైవర్ల ఖాకీ చొక్కాలను ధరించి హాజరయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ నిన్న చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. నేడు ఆటో డ్రైవర్ల సమస్యల చర్చకు డిమాండ్ చేస్తూ.. ఆటో డ్రైవర్ల ఖాకీ చొక్కాను ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటో డ్రైవర్ చొక్కా ధరించి స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ముందుగా బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ కోసం బోర్డు ఏర్పాటుచేయడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారని వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను బేషరతుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12వేలు ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. అలాగే.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించారు.

మరోవైపు.. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లపై హాట్‌హాట్‌గా చర్చ సాగింది. ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు పాలకులు కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌దే కమీషన్ల ప్రభుత్వమని, గొర్రెల స్కీమ్ నుంచి మొదలుపెడితే దళితబంధు స్కీమ్ వరకూ వేల కోట్లను బీఆర్ఎస్ నేతలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో వివేకానంద వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. వివేకానంద తన వ్యాఖ్యలను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని, నోటీసులు లేకుండా ఇతరాలపై మాట్లాడవద్దని హితవు పలికారు. ఆటో డ్రైవర్లను కూడా బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టి్స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా.. లేకపోతే మరోలా ఉంటున్నారని అన్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ ఫైర్ అయ్యారు. స‌భ‌లో మీ ప్రవర్తన మార్చుకోక‌పోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అటు.. కేటీఆర్‌పైనా స్పీకర్ సీరియస్ అయ్యారు. ‘కేటీఆర్.. ఇదేం పద్ధతి. అనవసర రాద్ధాంతం చేసి.. సభా సమయాన్ని వృథా చేయొద్దు’ అని స్పీకర్ సూచించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, గొడవ పెడితే.. మైక్ ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులు, జూనియర్ సభ్యులకు నేర్పించేది ఇదేనా అని మండిపడ్డారు.

ఈ చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మామ చాటు అల్లుడిగా ఉంటూ రూ.10వేల కోట్లు దోచుకున్న దొంగ హరీశ్ రావు అంటూ ఆరోపించారు. ఆ అవినీతిని తాము నిరూపిస్తామని చెప్పారు. దీనికి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలోకి వచ్చే సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని మండిపడ్డారు. సభ్యులపై ఆరోపణలు చేయొద్దని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రూలింగ్ బుక్ చూపించి వెల్లడించారని గుర్తుచేశారు. సుద్దులు తమకు చెప్పడం కాదని, వారి సహచర మంత్రికి కూడా చెప్పాలని హితవు పలికారు. వెంకటరెడ్డి కమీషన్ల లిస్టు చదవమంటే.. తానూ చదువుతానని అన్నారు. అలాగే.. రాష్ట్రంలోని రోడ్లపైనా ప్రధానంగా చర్చ సాగింది. బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానాలు ఇచ్చారు. విజయవాడను ఆరు లేన్ల హైవేగా మారుస్తున్నారని, ట్రిపుల్ ఆర్‌తోపాటు మరికొన్ని రోడ్లను అభివృద్ధి చేస్తు్న్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదన్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను పూర్తిచేయలేకపోయారన్నారు. ఓఆర్ఆర్‌ను రూ.7వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.