Begin typing your search above and press return to search.

మొన్న సంకెళ్లు.. నిన్న ఆటో.. నేడు ఎడ్లబండి.. బీఆర్ఎస్ అసెంబ్లీ పాలిటిక్స్

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత పదేళ్లలో అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తొలిసారి ప్రతిపక్ష సీట్లలో కూర్చుంది

By:  Tupaki Desk   |   19 Dec 2024 9:40 AM GMT
మొన్న సంకెళ్లు.. నిన్న ఆటో.. నేడు ఎడ్లబండి.. బీఆర్ఎస్ అసెంబ్లీ పాలిటిక్స్
X

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత పదేళ్లలో అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తొలిసారి ప్రతిపక్ష సీట్లలో కూర్చుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలకు వినూత్న రూపాల్లో హాజరవుతూ సభ్యులు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. రోజుకో సమస్యతో శాసనసభకు వస్తున్నారు. మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ బొమ్మలతో కూడిన టీషర్టులు ధరించి వచ్చారు. ఆ తరువాత ఆటో డ్రైవర్ వేషంలో హాజరయ్యారు. ఇలా రోజుకో అంశాన్ని టార్గెట్ చేస్తూ.. రోజుకో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నిరసనకు దిగుతున్నారు.

అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన మొదటి రోజు చేతులకు సంకెళ్లు ధరించి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. నల్ల చొక్కాలు ధరించి.. చేతులకు బేడీలతో సమావేశాలకు హాజరయ్యారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ వీరు ఈ రకమైన నిరసనకు దిగారు. ‘రైతు చేతికి సంకెళ్లా.. సిగ్గు సిగ్గు’ అంటూ అసెంబ్లీ ఆవరణలో హల్‌చల్ చేశారు. లగచర్ల నిందితులను వెంటనే విడదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఇక నిన్న... ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాకీ చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటో నడుపుకుంటూ సమావేశాలకు వచ్చారు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆటో కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి సమర్పించామని కేటీఆర్ తెలిపారు. అయినా ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు పడుతూ.. ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆటో డ్రైవర్లు ఎవరూ అలా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వారికి న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. ఇదే సందర్భంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ శాసనసభాపక్షం తరఫున అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అటు.. శాసనమండలిలో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

ఇక.. ఈ రోజు రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చారు. మెడలో ఆకుపచ్చ కండువాలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. రైతు సమస్యలపై శాసనసభలో, మండలిలో చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇఛ్చారు. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక.. అన్ని పంటలకు బోనస్ అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగి కోసం వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. అలాగే.. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. అన్ని పంటలకు బోనస్ చెల్లించాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరినప్పటికీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను సైతం ఆ దిశగా వాడుకుంటున్నారు. ఒక్కోరోజు ఒక్కో వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. వేషాలు వేస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండడం రాష్ట్రవ్యాప్తంగానూ చర్చకు దారితీస్తోంది. ఇంకా ముందు ముందు మరెలాంటి వేషాలు ధరిస్తారో చూద్దాం.