వైబ్ కావాలంటే కళ్ళు, మాంసం దుకాణం పెట్టుకో.. రేవంత్, దిల్ రాజుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై.. నిన్న తీసుకున్న నిర్ణయంపై వారు నిలదీశారు. అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఉత్తదేనంటూ విమర్శలు చేశారు.
By: Tupaki Desk | 9 Jan 2025 9:36 AM GMTతెలంగాణ ప్రభుత్వంపై, సినీ నిర్మాత దిల్ రాజుపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై.. నిన్న తీసుకున్న నిర్ణయంపై వారు నిలదీశారు. అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఉత్తదేనంటూ విమర్శలు చేశారు.
తెలంగాణలో విడుదల చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు మినహాయింపులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటని బీఆర్ఎస్ నాయకుడు, మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు ఎలా ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై మాట తప్పినట్టే సినిమా టికెట్ల రేట్లు పెంపుపైనా ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షోలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం తప్ప రేవంత్‌కి ఏది చేతకావడం లేదని విమర్శించారు. అన్నింటిపై రేవంత్ యూటర్న్ తీసుకుంటున్నారని, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
మరో నేత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సైతం స్పందించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కల్చర్‌ను అవమానించేలా దిల్ రాజ్ వ్యవహరించారంటూ అసహనం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన దిల్ రాజ్ వ్యవహార శైలిపై రగిలిపోయారు. దిల్ రాజ్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనలేదని, ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కూడా కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా ఇక్కడి ప్రజలకు అండదండగా నిలవలేదన్నారు. అటువంటి వ్యక్తి తాజాగా నిజామాబాదులో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ ను అవమానించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. గేమ్ చేంజర్ సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వైబ్ రావడం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో సినిమాలు విడుదల చేస్తే వైబ్ ఉంటోందని, తెలంగాణలో విడుదల చేసే సినిమాలకు వైబ్ ఉండడం లేదంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ కల్చర్ ను అవమానించడమేనని దేశపతి శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో విడుదల చేసే సినిమాలకు వైబ్ లేకపోతే ఇక్కడ విడుదల చేయడం మానుకోవాలని హితవు పలికారు. వైబ్ కావాలంటే కల్లు, మాంసం దుకాణం పెట్టుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. తెలంగాణలో సినిమా వ్యాపారం మానుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకుని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావ్ అంటూ దేశపతి శ్రీనివాస్ నిలదీశారు. ఈ తరహా వ్యాఖ్యలు మానుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడిందని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.