పొద్దు పొద్దున్నే అరెస్టు.. బీఆర్ ఎస్‌కు షాకిచ్చిన పోలీసులు!
గురువారం తెలతెల వారుతూనే .. బీఆర్ ఎస్ కీలక నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి ముందుకు పోలీసులు వాలిపోయారు.
By: Tupaki Desk | 26 Dec 2024 8:31 AM GMTగురువారం తెలతెల వారుతూనే .. బీఆర్ ఎస్ కీలక నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి ముందుకు పోలీసులు వాలిపోయారు. ఆయన తలుపు తట్టారు. కానీ, ఆయన తీయలేదు. దీంతో తలుపులు తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నంచేశారు. ఇంతలో బీఆర్ ఎస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులు ఒక్కసారిగా వాలిపోయారు. దీంతో పోలీసులకు వారికి మధ్య వివాదం రేగింది. మాటమాటా పెరిగింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎర్రోళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామం.. బీఆర్ ఎస్‌కు షాకిచ్చినట్టయింది.
ఏం జరిగింది?
బీఆర్ ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గురించి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి సమయంలో ఆయనను నిలువరిస్తూ.. పోలీసులతో ఎర్రోళ్ల వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ తనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారంటూ.. ఎర్రోళ్లపై ఫిర్యాదు చేశారు. ఇది జరిగి రెండు రోజులు అయిపోయింది. అయితే.. గురువారం అనూహ్యంగా పోలీసులు 41 ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు.
అయితే.. పోలీసులు వచ్చారని తెలుసుకున్న శ్రీనివాస్.. తలుపులకు లోపలివైపు తాళాలు వేసుకున్నా రు. ఇదేసమయంలో బీఆర్ ఎస్ కార్యకర్తలను కూడా అలెర్ట్ చేశారు. ఇంతలో బీఆర్ ఎస్ కార్యకర్తలు అక్క డకు చేరుకోవడం.. పోలీసులను వారు అడ్డుకుని నిలదీయడంతో వివాదం పెరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయినప్పటికీ.. పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
హరీష్ ఆగ్రహం..
ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడంపై మాజీమంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?' అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ``అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు.. ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా`` అని పేర్కొన్నారు. అక్రమ అరెస్టు దారుణమని వ్యాఖ్యానించారు. నోటీసు లేకుండా అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని హరీష్‌రావు నిప్పులు చెరిగారు.