లగచర్ల.. చేతికి 'సంకెళ్ల'.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
లగచర్ల రైతుకు సంకెళ్లు వేసిన ఘటనను నిరసిస్తూ.. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల దుస్తులతో సభకు వచ్చినవారు చేతులకు బేడీలతో నినాదాలు చేశారు.
By: Tupaki Desk | 17 Dec 2024 6:13 AM GMTప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. శీతాకాల సెషన్ లో రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకున్నా బీఆర్ఎస్ కీలక నాయకులు కేటీఆర్, హరీశ్ రావులు అంతా తామే అయి నడిపిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే రేవంత్ సారథ్యంలోని ప్రభుత్వం బదులిస్తోంది. సోమవారం నాటి సెషన్ లో సర్పంచులకు బిల్లుల పెండింగ్ అంశం సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా సాగుతోంది.
సెగచర్ల..
తెలంగాణలో దాదాపు రెండు నెలల కిందట సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో రైతులు ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా అధికారులపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం వెనక్కుతగ్గింది. అయితే, ఆ దాడి ఘటనలో కేసులు నమోదైన రైతులు, ఊరి ప్రజలు ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ రైతుకు గత వారం సంకెళ్లు వేసి జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడం తీవ్ర రగడకు దారితీసింది. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుకావడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అది అందివచ్చిన అస్త్రంగా మారింది.
రైతుకు సంకెళ్లా?
లగచర్ల రైతుకు సంకెళ్లు వేసిన ఘటనను నిరసిస్తూ.. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల దుస్తులతో సభకు వచ్చినవారు చేతులకు బేడీలతో నినాదాలు చేశారు. రైతులకు బేడీలా? సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి సోమవారం కూడా లగచర్ల అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలు చేశారు.
పర్యాటక విధానంపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వల్ప కాలిక చర్చను ప్రారంభించగానే బీఆర్‌ఎస్ సభ్యులు పైకి లేచి ‘లగచర్ల’ రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చకు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ ప్రసాద్ కుమార్ అంగీకరించలేదు. ఈ నేపత్యంలో బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో వెల్ లోకి దూసుకొచ్చారు.
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు, చిత్రహింసలకు నిరసనగా మంగళవారం తెలంగాణ అంతటా నిరసనలు తెలపాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.