Begin typing your search above and press return to search.

జైలు నుంచి కారెక్కినంతనే కవితకు ఫోన్ చేసిందెవరు?

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు అలవాటే.

By:  Tupaki Desk   |   28 Aug 2024 4:33 AM GMT
జైలు నుంచి కారెక్కినంతనే కవితకు ఫోన్ చేసిందెవరు?
X

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు అలవాటే. సాధారణంగా ఏ తండ్రి అయినా తన గారాలపట్టికి కష్టం వచ్చిందంటే ముందు తాను ఉంటారు.కానీ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న వేళలో కానీ.. అరెస్టు వేళలో కానీ.. జైల్లో ఉన్న ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆమెను నేరుగా వెళ్లి పలుకరించకుండా ఉండటం తెలిసిందే.

జైల్లో కూతురు ఉన్న వేళ.. పలుకరించటానికి కనీసం వెళ్లకుండా ఉండటం ఏమిటన్న విమర్శను కేసీఆర్ ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తనకంటూ ఉన్న కొన్ని సెంటిమెంట్ల నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కూతురు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న కేసీఆర్.. జైల్లో ఉన్న కవితను చూసేందుకు సుతారం ఇష్టం లేదని చెబుతారు.ఈ కారణంగానే జైలుకు వెళ్లలేదంటారు. అయితే.. ఆమెపై తనకున్న ప్రేమ ఎంతన్న విషయాన్ని తాజాగా చేతల్లో చూపించారు కేసీఆర్.

అంచనాలకు తగ్గట్లే సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెలువడటం.. ఆ వెంటనే రిలీజ్ ఆర్డర్లు రెఢీ కావటం తెలిసిందే. ముందుగా అంచనా వేసిన దానికి తగ్గట్లే మంగళవారం సాయంత్రం ఆరేడు గంటల సమయంలో తీహార్ జైల్ నుంచి కవిత బయటకు రావటం తెలిసిందే. ఆమె బయటకు వచ్చే వేళకు అక్కడే ఉన్న కేటీఆర్.. హరీశ్ లు ఆమెకు స్వాగతం చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చి.. అందరికి అభివాదం చేసి కారు ఎక్కి కూర్చున్నంతనే కేసీఆర్ ఫోన్ కాల్ చేసినట్లుగా తెలిసింది.

నాన్న.. అంటూ కవిత పిలుపు తీవ్రమైన భావోద్వేగంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఫోన్ లో ఒకవైపు తానెంతో ప్రేమించే తండ్రి ఉన్నప్పటికీ.. ఆమె నోటి వెంట మాటలు రాలేదని తెలుస్తోంది. తండ్రి కేసీఆర్ గొంత విన్నంతనే ఆమె కన్నీటిపర్యంతం అయినట్లుగా సమాచారం. కుమార్తెను ఓదార్చిన కేసీఆర్.. బిడ్డా.. ఎట్లున్నవ్? ప్రాణం మంచిగున్నదా? అని అడిగినట్లుగా తెలుస్తోంది. బాధపడొద్దని..ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు తండ్రి యోగక్షేమాల గురించి మాట్లాడిన కవిత.. కొన్ని కుశల ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన కవిత మంగళవారం రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. భర్త అనిల్.. సోదరుడు కేటీఆర్ తో పాటు పలువురు కుటుంబ సభ్యులతోకలిసి ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళతారని చెబుతున్నారు.