Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీలో కీలక పోస్టు ఖాళీ.. వారి సమస్యలపై గళమెత్తేది ఎవరు..?

పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు అధ్యక్షుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 11:30 AM GMT
గులాబీ పార్టీలో కీలక పోస్టు ఖాళీ.. వారి సమస్యలపై గళమెత్తేది ఎవరు..?
X

పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు అధ్యక్షుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షలాది జనంతో నిండిపోయిన పార్టీలో.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో తెలియక సతమతం అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఇప్పుడు కీలక పోస్టుకు ఓ నేత దొరక్కపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పదేళ్లలోనే పార్టీలో ఈ పరిస్థితి రావడంపై కేడర్‌లోనూ ఆందోళన కనిపిస్తోంది.

బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పోస్టు ప్రస్తుతం ఖాళీ అయింది. పార్టీకి 60 లక్షల మహిళల సభ్యత్వాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతున్నప్పటికీ.. వారిలో ఓ సమర్థురాలైన అధ్యక్షురాలు లేకుండా పోయారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తరఫున మహిళల గళం వినిపించే వారు కరువయ్యారు. ఇంత సీనియర్ పార్టీ అయినప్పటికీ మహిళా విభాగాన్ని ఎందుకు బలోపేతం చేయడం లేదన్న అనుమానాలూ కేడర్‌లో కలుగుతున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి పది నెలలు అవుతోంది. ఈ పది నెలల కాలంలో రాష్ట్రంలో మహిళలపై 1,900 లైంగికదాడులు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కానీ.. ఇంతవరకు మహిళల పక్షాన వాయిస్ వినిపించేందుకు మహిళా అధ్యక్షురాలు లేకుండాపోయారు. గతంలో మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన గుండు సుధారాణి గతేడాది పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాంతో అప్పటి నుంచి ఆ పదవి ఖాళీ గానే ఉంది. ఇప్పటివరకు ఆ పోస్టు భర్తీపై అధిష్టానం పెద్దలు దృష్టి సారించడం లేదు.

కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోనూ ప్రధానంగా ఒకటి మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించింది. కానీ.. పది నెలలైనా ఇంకా ఆ పథకం అమల్లోకి రాలేదు. దీనికితోడు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసలు నాయకురాలు లేకపోవడంతో అటు లైంగిక దాడులపై, ఇటు మహాలక్ష్మి పథకంపై ప్రశ్నించే వారు కరువయ్యారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళల సమస్యలపైనా మాట్లాడే వారు కరువయ్యారు. ఐదు నెలలుగా అధ్యక్ష పోస్టు ఖాళీ ఉన్నప్పటికీ పార్టీ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వీలైనంత తొరగా కమిటీని వేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా గులాబీ అధినేత ఈ విషయంలో ఏదైనా చర్యలు తీసుకుంటారో చూడాలి.