Begin typing your search above and press return to search.

విరాళాల్లో బీజేపీ తర్వాత ఆ పార్టీదే స్థానం..!

కానీ.. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు మించి కలెక్షన్లు రాబట్టింది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 1:30 PM GMT
విరాళాల్లో బీజేపీ తర్వాత ఆ పార్టీదే స్థానం..!
X

రాజమౌళి దర్శకత్వంలో నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే.. ఈ సినిమా కలెక్షన్లు మొత్తంగా చూస్తే రూ.1,236 కోట్లు మాత్రమే. కానీ.. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు మించి కలెక్షన్లు రాబట్టింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విరాళాలు, ఫండ్స్ ఈ పార్టీ వద్ద ఉండడం గమనార్హం.

భారతీ రాష్ట్ర సమితి పార్టీ రిచెస్ట్ పార్టీగా నిలిచింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో కంటే అత్యధిక ధనిక పార్టీగా గులాబీ పార్టీ టాప్‌లో నిలిచింది. ఏ పార్టీకి లేని డబ్బులు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లోనే ఉండిపోయాయి. అయితే.. తమ వద్ద ఇన్ని డబ్బులు ఉన్నాయని స్వయంగా బీఆర్ఎస్ పార్టీనే వెల్లడించింది. ఈసీ వెబ్‌సైట్‌లోనూ ఆ లెక్కలను ఎంట్రీ చేశారు.

2023-24 ఏడాదికి గాను అత్యధిక విరాళాలు పొందిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈసీ వెబ్ సైట్ ప్రకారం.. విరాళాల రూపంలో బీజేపీ అత్యధికంగా రూ.2,244 కోట్లను సాధించింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం అని వెల్లడించింది. ఇక తరువాతి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. రూ.494.5 కోట్లతో సెకండ్ ప్లేసు సాధించింది. కాంగ్రెస్ పార్టీ రూ.288.9 కోట్లు పొందింది. వైసీపీ రూ.121.5 కోట్లు, డీఎంకే రూ.60 కోట్లు పొందినట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడించాయి.

ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో రూ.1449 కోట్లు ఉండడం గమనార్హం. అంతకుముందు రూ.626 కోట్లతో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ టాప్ ప్లేసులో ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ పార్టీని కిందకు నెట్టేసి కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ టాప్ ప్లేసుకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రారంభం నాటికి ఆ పార్టీ ఖాతాలో రూ.1,519 కోట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ముగిసేలోపు బీఆర్ఎస్ పార్టీకి రూ.47.56 కోట్ల విరాళాలు వచ్చాయి.