'బీఆర్ ఎస్' పై పెను దుమారం.. ఏం జరిగింది?
రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. పరిస్థితులను బట్టి.. అవకాశం-అవసరం అనే జారుడు మెట్ల పై విన్యాసాన్ని బట్టి నాయకులు పార్టీలు కూడా మార్పులు చేసుకుంటుంటాయి.
By: Tupaki Desk | 6 Nov 2023 5:18 AM GMTరాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. పరిస్థితులను బట్టి.. అవకాశం-అవసరం అనే జారుడు మెట్ల పై విన్యాసాన్ని బట్టి నాయకులు పార్టీలు కూడా మార్పులు చేసుకుంటుంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థి తే తెలంగాణలోనూ కనిపిస్తోంది. అయితే.. ఈ మార్పును ప్రజలు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ, బీజేపీకి చెక్ పెడతామని కూడా చెప్పు కొచ్చారు. వివిధ రాష్ట్రాలకు హెలికాప్టర్ వేసుకుని మరీ చక్కర్లు కొట్టి.. అక్కడి నేతలను కలుసుకున్నారు. జాతీయస్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం చెప్పుకొచ్చారు. సో.. మొత్తానికి ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా జాతీయం చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే కేసీఆర్ టంగ్ మార్చేశారు. జాతీయ పార్టీలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
``నేను ఒక్కటే చెబుతున్నా. జాతీయ పార్టీలకు విలువ లేదు. ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపు తున్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్నారు. కాబట్టి.. ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి!`` అని కేసీఆర్ సెలవిచ్చారు. ఇదే ఇప్పుడు బీఆర్ ఎస్‌లో పెనుదుమారాన్ని రేపింది. జాతీయ పార్టీలకు ప్రజల్లో విలువ లేదని చెబుతున్న కేసీఆర్.. తనప్రాంతీయ పార్టీని ఎందుకు జాతీయం చేశారు? దీనికి సంధించిన సభలు(మహారాష్ట్రలో), సమావేశాలకు తెలంగాణ సమాజం పన్నుల రూపంలో కట్టిన సొమ్మును ఎందుకు వినియోగించారు? అనేది ప్రశ్న.
అంతేకాదు.. ప్రజలు ప్రాంతీయ పార్టీలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్న కేసీఆర్.. మరి తనంతట తానుగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ ఎస్‌ను జాతీయపార్టీగా మార్చుకున్న నేపథ్యంలో ఇక, జాతీయ స్థాయిలో ఉద్యమించడం ఆపేస్తారా? అనేది కీలక ప్రశ్న. లేక , ప్రస్తుత ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను నిలువరించేందుకు ఆయన ఇలా చెబుతున్నారా? మరో కొత్తరకం సెంటిమెంటుకు ఆయన పునాదులు వేస్తున్నారా? అనేది ప్రశ్న.
నిజానికి ప్రాంతీయ పార్టీలదే దేశంలో హవా కొనసాగుతోంది. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసు. కానీ, జాతీయస్థాయిలో ఉద్యమిస్తానని చెప్పారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా మాటమార్చి.. ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పడం.. జాతీయపార్టీలకు విలువ లేదని వ్యాఖ్యానించడం.. బీఆర్ ఎస్‌పై పెను ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.