ఇవన్నీ డ్రామాలేనా ?
సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ప్రివిలేజ్ నోటీసులు జారీచేసింది.
By: Tupaki Desk | 14 Nov 2023 3:30 PM GMTసోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ప్రివిలేజ్ నోటీసులు జారీచేసింది. ఎందుకంటే సెప్టెంబర్లో జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సురేష్ రెడ్డి, దామోదరరావు, రవిచంద్ర, లింగయ్య యాదవ్ నిరసనలు తెలుపుతు ప్లకార్డులు ప్రదర్శించారట. సభలో నియమ, నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకడ్ కు బీజేపీ ఎంపి వివేక్ ఠాకూర్ ఫిర్యాదుచేశారు. ఈనెల 28వ తేదీలోగా ప్రివిలేజ్ నోటీసులకు సమాధానాలు చెప్పాలని అందులో స్పష్టంగా ఉంది.
సరే నోటీసులో ఏముంది, వీళ్ళేమని సమాధానాలు ఇస్తారన్నది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించటం అన్నది చాలా పెద్ద నేరంగా బీజేపీ చూస్తోందా ? అనే సందేహం పెరిగిపోతోంది. ప్లకార్డులు ప్రదర్శించినందుకే ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీచేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనివెనుక ఇంకో కథుందనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. అదేమిటంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కాంగ్రెస్ పదేపదే ఆరోపిస్తోంది.
రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేయకపోవటం, ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల మీద మాత్రమే ఐటి శాఖ దాడులు చేస్తుండటం లాంటి అనేక కారణాలతో రెండు పార్టీలు ఒకటే అన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలనే జనాలు కూడా నమ్ముతున్నారు. ఈ ఆరోపణల్లోనుండి బయటపడకపోతే ఎన్నికల్లో రెండుపార్టీలకు భారీ నష్టాలు తప్పవని రెండు పార్టీలకు అర్ధమైనట్లుంది.
అందరకనే బీఆర్ఎస్ ఎంపీలకు రాజ్యసభ కార్యాలయం నోటీసులు జారీచేసిందనే ప్రచారం మొదలైపోయింది. నోటీసులు పంపటం ద్వారా తమ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఏమీ లేవని తాము ప్రత్యర్ధి పార్టీలమే అని చెప్పుకోవాలన్నది బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఉద్దేశ్యంగా జనాలు చెప్పుకుంటున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండుపార్టీలకు ఈ ఎన్నికలు శీల పరీక్షగా మారినట్లే అనిపిస్తోంది. పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు సరే మరి జనాలు ఏమని ఫిక్సవుతారో చూడాల్సిందే.