మాలలు రివర్సయ్యారా ?
అనుకున్నట్లే ఎస్సీ వర్గీకరణను మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
By: Tupaki Desk | 12 Nov 2023 12:30 PM GMTఅనుకున్నట్లే ఎస్సీ వర్గీకరణను మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కోసం తొందరలోనే ఒక కమిటీని వేయబోతున్నట్లు మాదిగల విశ్వరూప బహిరంగ సభలో మోడీ ప్రకటించారు. మోడీ అలా ప్రకటించారో లేదో వెంటనే మాలలు ఇలా వ్యతిరేకించటం మొదలుపెట్టారు. ఎస్సీల్లో మాదిగల ఓట్లకోసమే మోడీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు.
ఒకపుడు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే కొద్దినెలలుగా అదంతా నీరుగారిపోయి చివరకు బీజేపీని ఇపుడు ఎవరు పట్టించుకోవటంలేదు. ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో ఫైట్ ఇవ్వటం కన్నా బీజేపీ నేతల ఫైటింగ్ అంతా మీడియాలో మాత్రమే కనబడుతోంది. ఈ నేపధ్యంలోనే ఏదో ఒక బలమైన వర్గం మద్దతు పొందకపోతే దారుణమైన ఓటమి తప్పదని బీజేపీకి అర్ధమైపోయినట్లుంది. అందుకనే తేనెతుట్టె లాంటి ఎస్సీ వర్గీకరణను కదిలించింది.
సంవత్సరాల తరబడి డిమాండుగానే మిగిలిపోయిన ఎస్సీ వర్గీకరణకు మోడీ మద్దతు ఇవ్వటం, కమిటీని వేస్తామని చెప్పటం అంటే ఒక అడుగు ముందుకేయటమే. అయితే ఇదే సమయంలో మాలల వ్యతిరేకతను తట్టుకోవాల్సుంటుంది. ఇపుడదే మొదలైపోయింది. వర్గీకరణకు మోడీ మద్దతును మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ ఓడించాలని మాల ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ జీ చెన్నయ్య పిలుపిచ్చారు. వర్గీకరణ చేయాల్సిందే అని ఎస్సీల్లోని మాదిగలు ఎంతగా పోరాడుతున్నారో చేయకూడదని మాలలూ అంతే పోరాడుతున్నారు.
మాదిగ, మాలల్లో ఎవరినీ దూరం చేసుకోవటం ఇష్టంలేని పార్టీలు వర్గీకరణ అంశాన్ని అలా పెండింగులో పెట్టేశాయి. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే తెలంగాణాలో మాదిగల జనాభా ఎక్కువగా ఉంటే ఏపీలో మాలల జనాభా చాలా ఎక్కువగా ఉంది. ఏపీలో ఎటూ బలంలేదు కాబట్టే కనీసం తెలంగాణాలో మాదిగల మద్దతన్నా సంపాదించుకోవాలని ధైర్యంచేసి మోడీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించినట్లున్నారు. మరి మోడీ హామీతో తెలంగాణాలోని 18 ఎస్సీ నియోజకవర్గాల్లో ఎన్నింటిని బీజేపీకి గెలుచుకుంటుందో చూడాలి.