90 డేస్ ఫార్ములా ఆ ఎమ్మెల్యేలలో వణుకు !
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదట చేరగా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు వివిధ సమయాల్లో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
By: Tupaki Desk | 29 July 2024 6:30 AM GMTతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు వణుకు పుట్టిస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో 26 మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదట చేరగా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు వివిధ సమయాల్లో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆయన ఫిర్యాదును స్వీకరించేందుకు ముందుకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు ఫిర్యాదును స్వీకరించక తప్పని పరిస్థితులలో స్పీకర్ దానిని తీసుకున్నారు.
అదే సమయంలో పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులోనూ పోరాడుతున్నది. ముఖ్యంగా దానం నాగేందర్ మీద వేసిన అనర్హత పిటీషన్ పై వేగంగా విచారణ కొనసాగుతున్నది. ఒక్క జూలై నెలలోనే 3,8,17,22,26 తేదిలీలో హైకోర్డు విచారణ చేసి ఇరు పక్షాల వాదనలు విన్నది. ఈ నెల 30న హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
హైకోర్టు నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ ఈ అంశం మీద సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తుంది. గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల మీద, జార్ఖండ్ మరియు ఇతర రాష్ట్రాలలో స్పీకర్లు అనర్హత వేటు విషయంలో కాలయాపన చేయడంపై సుప్రీం కోర్టు తప్పుపట్టింది. విచక్షణ అధికారం పేరుతో సాగదీయకూడదని వారికి 90 రోజుల వ్యవధిని నిర్ణయించింది.
దీంతో దేశవ్యాప్తంగా అనర్హత వేటు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరే పరిస్థితులు కనిపించడం లేదు. మరో వైపు స్పీకర్ కు చేరిన ఫిర్యాదులకు 90 రోజుల గడువు దగ్గర పడుతున్నది. దీంతో ఒకరి వెనక ఒకరిపై అనర్హత వేటు ఖాయం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కొద్ది రోజులుగా ఈ దిశగా సీఎం రేవంత్ దృష్టి సారించడం లేదని, సీఎం స్థాయిలో రాజ్యాంగబద్దమైన విషయాలలో జోక్యం చేసుకుని విమర్శలు ఎదుర్కోవడం కన్నా తటస్థంగా ఉండటం మేలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30న హైకోర్టు తీర్పు వస్తే ఇక అనర్హత పిటీషన్ బంతి సుప్రీంకోర్టులో పడుతుంది.