నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే..
చివరకు ఆయన బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 March 2024 11:00 AM GMTలోక్ సభ ఎన్నికల ముంద తెలంగాణలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యారు. ఆమెను ఢిల్లీలో కోర్టులో హాజరుపరిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండగా, అనూహ్యంగా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మరీ ఆయన కారు పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రవీణ్ కుమార్ భావజాలానికి బీఆర్ఎస్ లో మనగలగడం సాధ్యమా? అనేది పక్కనపెడితే.. తెలంగాణలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నో పరిణామాల మధ్య బీఆర్ఎస్ కు ఇదొక ఊరట.
సీట్ల కేటాయింపుపై మాయావతి గుర్రు
కేసీఆర్ రెండు సీట్లే ఇస్తామనడం, అందులో ఒకటి ఎంఐఎంకు తప్ప ఏ పార్టీకీ గెలుపు అవకాశాలు లేని హైదరాబాద్ కావడంతో మాయవతి సంతృప్తి చెందలేదని అందుకే పొత్తు వద్దన్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైనందునే ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి గుడ్ బై చెప్పినట్లు స్పష్టమవుతోంది. చివరకు ఆయన బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పోటీ అక్కడినుంచేనా?
బీఆర్ఎస్ లో చేరే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ సమావేశం అయ్యారు. కాగా, ఆయన నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇతర పార్టీలతో పొత్తులు వద్దనడంతోనే ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సిర్పూర్ జనరల్ సీటు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రవీణ్ కుమార్.. లోక్ సభ ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు. అయితే, మాయావతి మాత్రం లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. అప్పటికీ బీఆర్ఎస్ అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ కూటమిలో లేనందున పొత్తులు పెట్టుకునేలా ఒప్పించారు. ఈ మేరకు లక్నో నుంచి బీఎస్పీ ప్రతినిధి వచ్చి కేసీఆర్ తో చర్చించారు. దీంతోనే హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చారు.