బీఆర్ఎస్ కు ఆ కులాల ఓట్లు ఎందుకు దూరమయ్యాయి
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ మొదలైప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని దాదాపు చాలా వరకు సర్వేలు చెప్పాయి
By: Tupaki Desk | 11 Dec 2023 4:30 PM GMTతెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ మొదలైప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని దాదాపు చాలా వరకు సర్వేలు చెప్పాయి. అనుకున్న మేర కాకపోయినా మంచి పర్ఫార్మెన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ చివరికి అధికారాన్ని కైవసం చేసుకుంది. 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్, మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ తమకు వచ్చిన ఓట్లు, సాధించిన సీట్లు, బెస్ట్ పర్ఫార్మెన్స్ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తి కర విషయాలు బయటపడ్డాయి.
ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఆదిపత్యం కోసం సామాజికవర్గాల మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. వారి ఆకాంక్షల మేరకు కొందరు నాయకులు వారిలో నుంచే వస్తే.. మరి కొందరు ఇతర సామాజికవర్గాలకు అండగా నిలబడతారు. అయితే, ఇటీవల తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అందులో పోలైన ఓట్లను కులాల, మతాల వారీగా విభజించి పరిశీలిస్తే ఆశ్చర్యం కరమైన విషయాలు తెలిశాయి. అగ్రవర్ణాల నుంచి దళితుల వరకు ఏఏ పార్టీని అక్కున చేర్చుకున్నారు. అందులో పార్టీలు ఎంత వరకు విజయం సాధించాయో లోక్‌నీతి CSDS పోస్ట్ పోల్ స్టడీని ఇక్కడ పరిశీలిద్దాం..
కాంగ్రెస్ గెలుపులో ప్రధాన భూమిక వీరిదే
తెలంగాణలో దాదాపు కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ కర్ణాటక గెలుపుతో జవసత్వాలు నింపుకుంది. ఒంటరిగానే పోరాడుతూ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ చాలా వరకు సర్వేలు 70 నుంచి 80 వరకు సీట్లు వస్తాయని అంచనావేసినా ఆ మేరకు రాలేకపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఏ సామాజికవర్గం ముఖ్య భూమిక పోషించిందన్న చర్చ మొదలైంది. లోక్‌నీతి సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది రెడ్డి సామాజికవర్గం. ఈ అగ్రవర్ణాలు హస్తం పార్టీని అక్కున చేర్చుకున్నాయి. ఈ వర్గం ఓట్లు 49 శాతం కాంగ్రెస్ కు పడితే.. బీఆర్ఎస్ కు 34 శాతం, బీజేపీకి 11శాతం మాత్రమే పడ్డాయి.
మొదటి నుంచి చాకచక్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఈ వర్గం ఓట్లను తమ వైపునకు మళ్లించుకోవడంలో సఫలీకృతమైందని తెలుస్తోంది. ఈ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులకే ఎక్కువగా సీట్లు కేటాయించారు. దాదాపు ఒక్కో జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలను ఆ సామాజికవర్గంకు చెందిన నాయకులకు కేటాయించడంతో బహూషా ఇది కూడా ఓట్లను రాబట్టిందని చెప్పవచ్చు.
ఇక తెలంగాణలో ప్రధానంగా ఉన్న బీసీ ఉప కులాల ఓట్లను కూడా రాబట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ వైపునకు వెళ్లకుండా ఒడిసిపట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గౌడ, గొళ్ల సామాజికవర్గంకు చెందిన ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. లంబాడీ తండాలకు సంబంధించి గంపగుత్తగా ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయి. ముస్లిం ఓట్లు తమ వైపునకు వస్తాయని ఆశగా ఎదిరిచూసిన కాంగ్రెస్ కు కొంతమేర భంగపాటు ఎదుర్కొందని చెప్పవచ్చు. ఈ వర్గం ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. .
బీఆర్ఎస్ కు దూరమైన ఆ సామాజికవర్గం ఓట్లు..
రెండు సార్లు ప్రభుత్వాన్ని నడిపి హ్యాట్రిక్ కోసం శక్తిమేర పోరాటం చేసిన బీఆర్ఎస్ వివిధ సామాజికవర్గాల ఓట్లను రాబట్టడంలో కొంత మేర విఫలమైందని ఫలితాలు చూస్తే తెలుస్తోంది. తమ వైపునకు వస్తాయనుకున్న రెడ్డి ఓట్లు రాకుండా పోయినా.. బీసీల్లో మాత్రం ఇంకా బీఆర్ఎస్ అలానే ఉంది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఓట్లను కాంగ్రెస్ కంటే ఎక్కువగా తన వైపునకు తిప్పుకుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో హైదరాబాద్ లో భారీ సభ కూడా నిర్వహించారు. అయినా కూడా బీఆర్ఎస్ ను ముదిరాజులు ఆదరించారు. ఈ సామాజికవర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్ కంటే 3శాతం ఎక్కువగా బీఆర్ఎస్ కు పడ్డాయి.
దళిత బంధు కొంత మేరకు కలిసి వచ్చినా పెద్దగా తేడా కనిపించలేదు. దళితులు కూడా 3 శాతం కాంగ్రెస్ కంటే బీజేపీ వైపునకు మళ్లారు. ఇక ఎస్టీలు అయితే 10 శాతం మేర బీఆర్ఎస్ ను ఆదరించారు. ఎంఐఎంతో పొత్తు కారణంగా ముస్లిం ఓట్లు కొంత మేర బీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి.
బీజేపీని దూరంపెట్టిన బీసీలు..
రెండు పర్యాయాలు తెలంగాణను అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి నడిపాడు. దీంతో ఈ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ దక్కించుకోవాలని బీజేపీ ‘బీసీ సీఎం’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. కానీ ఇది ఆ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. ఎక్కువలో ఎక్కువగా బీజేపీని అదర్ అప్పర్ క్యాస్ట్ (బ్రాహ్మణ లాంటి) ఆదరించింది. బీజేపీ అనుకున్న మేర వారి ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతమైంది. అయితే ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడుకుంటే బీజేపీని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ గత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి వారు బీసీ సామాజికవర్గంకు చెందిన వారైనప్పటికీ ఓట్లను రాబట్టడంలో అనుకున్నంత మేర పర్ఫార్మెన్స్ చూపించలేదు. బీఆర్ఎస్ ముదిరాజులను పట్టించుకోకపోవడం, ఈటల బీజేపీలో ఉండడం, హైదరాబాద్ లో నిర్వహించిన సభతో గుడ్డిలో మెల్ల సామెతగా ముదిరాజ్, గొల్ల కుర్మలు రెడ్డి సామాజికవర్గం కంటే ఎక్కువగానే బీజేపీని ఆదరించారు.
ఏది ఏమైనా కులాల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోలైన ఓట్లలో తక్కువ తేడా కనిపించినా.. బీజేపీ మాత్రం ఆమడదూరంలో ఉంది. అయితే రెండు ప్రధాన పార్టీల కంటే ఓట్లను రాబట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించడంపై సర్వేల ఫలితాలు కూడా కారణం కావచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఈ సామాజికవర్గాల ఓట్లను పరిశీలిస్తే మూడు పార్టీలు ముక్కున వేలేసుకోవాల్సిందేనని పొలిటికల్ అనలసిస్ట్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.