Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ రూటు మార్చింది

పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సడెన్ గా బీఆర్ఎస్ నీటి రాజకీయాలు మొదలుపెట్టింది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 6:46 AM GMT
బీఆర్ఎస్ రూటు మార్చింది
X

పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సడెన్ గా బీఆర్ఎస్ నీటి రాజకీయాలు మొదలుపెట్టింది. కేసీయార్ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణా-ఏపీ మధ్య కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) వివాదాలపై పెద్దగా మాట్లాడలేదు. అలాంటిది అధికారంలో నుండి దిగిపోగానే వెంటనే కేఆర్ఎంబీ వివాదాలపై హరీష్ రావు చాలా మాటలే మాట్లాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళతాయనే వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు.

కేఆర్ఎంబీ పరిధిలోకి సాగునీటి ప్రాజెక్టులు వెళ్ళటాన్ని కేసీయార్ 2021లో వ్యతిరేకించిన విషయాన్ని హరీష్ గుర్తుచేస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణా వాటా తేలకుండానే, ఆపరేటివ్ మాన్యువల్ తేల్చకుండానే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంగీకరించిందని మండిపడ్డారు. ఈ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుందని వార్నింగులు కూడా ఇచ్చారు. ఇక్కడే హరీష్ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పదేళ్ళల్లో కృష్ణా నదిలో తెలంగాణా నీటి వాటా గురించి కేసీయార్ పెద్దగా మాట్లాడిందే లేదు.

కేసీయార్ ఎప్పుడు మాట్లాడినా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలున్నాయని, కాబట్టి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామనే చెప్పారు. ఇపుడు హరీష్ చెబుతున్న నీటి వాటా, ఆపరేటివ్ మాన్యువల్ లాంటివి కేసీయార్ ప్రస్తావించినట్లు ఎవరు వినలేదు. మొన్నటికి మొన్న తెలంగాణా ఎన్నికల సమయంలో సడెన్ గా నాగార్జునసాగర్ డ్యాం వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య పెద్ద ఫైట్ జరిగింది. ఆ ఫైట్ తెలంగాణా ప్రభుత్వం వైపునుండి మొదలైంది.

ఎన్నికల్లో లబ్దిపొందటం కోసమే కేసీయార్ సెంటిమెంటును రాజేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు అప్పట్లో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తప్ప తెలంగాణా సెంటిమెంటును కేసీయార్ ఎప్పుడూ వాడరని రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలనే కిషన్ రెడ్డి అండ్ కో కూడా వినిపించారు. ఇదంతా చూస్తుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లబ్దికోసమే హరీష్ నీటి వివాదాలను రేకెత్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు. దక్షిణ తెలంగాణాలోని ప్రాజెక్టులను పదేళ్ళపాటు పట్టించుకోని హరీష్ ఇపుడు సడెన్ గా నీటివాటాలని, మాన్యువలని మాట్లాడటమే విచిత్రంగా ఉంది.