కేసీఆర్ వెనక్కి తగ్గారా?
వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్లోకి చేరికలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 21 Aug 2023 10:47 AM GMTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకున్నది కచ్చితంగా చేసి తీరుతారనే అభిప్రాయాలున్నాయి. పార్టీ పరంగానైనా, ప్రభుత్వ పరంగానైనా ఆయన నిర్ణయాలు ఫైనల్. కానీ ఇటీవల ఓ విషయంలో కేసీఆర్ అంచనా తప్పిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే.. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవడం. ఈ విషయంపై కేసీఆర్ వెనక్కి తగ్గారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్లోకి చేరికలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని కారెక్కించుకుని కాంగ్రెస్ను ఇబ్బందుల్లోకి నెట్టాలని కేసీఆర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ మేరకు జగ్గారెడ్డితో చర్చలు కూడా జరిపారని తెలిసింది. జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందనే వార్తలు వచ్చాయి.
కానీ సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో జగ్గారెడ్డి చేతిలో ఓడి మరోసారి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరసన వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి జగ్గారెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దంటూ హరీష్ రావునూ కోరారు. కానీ తన చేతుల్లో ఏం లేదని హరీష్ చెప్పడంతో జగ్గారెడ్డి చేరిక ఖాయమనిపించింది.
కానీ సంగారెడ్డిలో సొంత పార్టీ నేతల నుంచి నిరసనను కేసీఆర్ పట్టించుకున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఎందుకు తలనొప్పి అని భావించి జగ్గారెడ్డిని వదిలేశారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కదనే సమాచారం వచ్చిన తర్వాతే జగ్గారెడ్డి కాంగ్రెస్ను వీడేది లేదని ప్రకటించారని చెబుతున్నారు.