ఆపేసినా ఆగదు బ్రో.. ‘అది కూడా’ ప్రచారమే!
ఎన్నికల వేళ.. ప్రచారానికి కాదేదీ అనర్హం!! ఏ విషయం అయినా.. తమకు అనుకూలంగా మార్చుకునేందు కు ప్రయత్నిస్తారు నాయకులు.
By: Tupaki Desk | 27 Nov 2023 2:30 PM GMTఎన్నికల వేళ.. ప్రచారానికి కాదేదీ అనర్హం!! ఏ విషయం అయినా.. తమకు అనుకూలంగా మార్చుకునేందు కు ప్రయత్నిస్తారు నాయకులు. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ లేవు. విషయం ఏదైనా.. తమకు ఉపయోగపడేలా మార్చేయడం.. నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా.. జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోఅధికార పార్టీబీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇరు పార్టీల నాయకులు కూడా విమర్శల తూటాలను పేల్చుకుం టున్నారు.
అయితే.. ఎన్నికలకు రెండు రోజుల ముందు.. రాష్ట్రంలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు పథకాలు.. పేర్లు.. పార్టీల నేతలను టార్గెట్ చేసుకుని ప్రచారం చేసిన బీఆర్ ఎస్ నాయకులు సోమవారం ఉదయం నుంచి టంగ్ మార్చేశారు. రెండు కీలక విషయాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అది కూడా.. ఎన్నికల సంఘం విధించిన షరతులు. హెచ్చరికలే కావడం గమనార్హం. వీటిలో ఒకటి కేసీఆర్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం. రెండు రైతు బంధుకు బ్రేకులు వేయడం.
ఇప్పుడు తాజాగా ఈ రెండు అంశాలను బీఆర్ ఎస్ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. అయితే. ఎక్కడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని వారు పన్నెత్తు మాట అనడం లేదు. అసలు ఆ పేరు కూడా ప్రస్తావించడం లేదు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను అడ్డు పెట్టి కాంగ్రెస్ ను మరింత ఏకేస్తున్నారు. ``కేసీఆర్‌పైనే ఫిర్యాదుచేసే మొనగోళ్లా వీళ్లు. పార్టీనే రద్దు చేయించాలనే కుతంత్రంలో ఉన్నరు`` అంటూ.. నాయకులు ప్రచారంలో వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా కేసీఆర్ త్యాగాలను, రాష్ట్రం కోసం.. చేసిన కృషినీ వెల్లడించే అవకాశం వారు అందిపుచ్చుకున్నారు. ఇవే విషయాలను ఎన్నికల ప్రచారంలో మరింత ఏకరువు పెడుతూ.. ``కాంగ్రెస్ ఎలానూ అధికారంలోకి రాదు కాబట్టి.. బీఆర్ ఎస్ ను ఏదో ఒకరకంగా బద్నాం చేయాలని చూస్తోంది. అందుకే ఈ ఫిర్యాదులు`` అంటూ నాయకులు మండిపడుతున్నారు. ఇక, రైతు బంధుపై విధించిన స్టేను కూడా.. అనుకూలంగా మార్చుకున్నారు.
``వాళ్లు(కాంగ్రెస్) వచ్చేదీ లేదు.. చచ్చేదీ లేదు. కానీ, ఇచ్చే నాయకులకు కూడా.. కాళ్ల సందున కర్రలు పెడుతున్నరు. కాంగ్రెస్ నేతలు లేకుంటే.. మీకు రైతు బంధు రాకుండేనా? అదిగో ఇదిగో అంటూ.. రైతులు సుఖంగా ఉంటే చూడలేకున్నరు. అందుకే ఆపించిన్రు. వారు వచ్చుడు లేదు..చచ్చుడు లేదు..`` అని ప్రచారంలో జోష్ పెంచారు. ఈ రెండు అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. సో.. మొత్తానికి ప్లస్ అయినా.. మైనస్ అయినా.. నాయకులు తమ ప్రచారంలో ఊపు తెస్తుండడం విశేషం.