ఐదుగురు కీలక నేతలు.. ఎవరికి వారే యమునా తీరే!
ముఖ్యంగా బీఆర్‌ఎస్ లో కీలక నేతలుగా పేరు తెచ్చుకున్న ఐదుగురు నేతలు ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 21 Feb 2024 5:39 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తయ్యాక బీఆర్‌ఎస్ ఇంకా కోలుకోలేదు. కీలకమైన పార్లమెంటు ఎన్నికలు మరో 50 రోజుల్లో జరగనున్నాయి. అయినా బీఆర్‌ఎస్ ఇంకా గాడినపడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ లో కీలక నేతలుగా పేరు తెచ్చుకున్న ఐదుగురు నేతలు ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ముందుగా కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంట్లో ఆయన కాలుజారి పడటంతో కాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆయన ఇంటికి, ఎర్రవలిల్లోని వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా హాజరు కావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తోపాటు స్వయంగా కేసీఆర్ కూడా ఓటమి పాలయ్యారు. దాదాపు పదేళ్లపాటు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమిపాలైన వ్యక్తిగా కేసీఆర్ దారుణమైన రికార్డును మూటగట్టుకున్నారు. ఈ పరాజయ భారంతోనే అసెంబ్లీకి రావడం లేదని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తాను ఆగర్భ శత్రువులాగా చూసిన రేవంత్ రెడ్డిని సీఎం పదవిలో చూడలేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు.
ఇక కేటీఆర్.. తండ్రి గైర్హాజరులో పార్టీ సమావేశాలను, కేడర్ కు దిశానిర్దేశం చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు. అయితే కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు వచ్చేసరికి చేతులెత్తేశారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ మంత్రులు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని అవినీతిపై మూకుమ్మడిగా విరుచుకుపడుతుండటంతో ధీటైన సమాధానం చెప్పలేక కేటీఆర్ మిన్నకుండిపోతున్నారని అంటున్నారు. ఉన్నంతలో హరీశ్ రావే ఉన్నంతలో ప్రభుత్వంపైన విరుచుకుపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక జోగినపల్లి సంతోషరావు కేసీఆర్ కు కుడి భుజంలా వ్యవహరించారు. తనకు మందు బిళ్లలు అందించడానికి ఆయనను పెట్టుకున్నానని గతంలో కేసీఆరే వెటకారంగా వెల్లడించారు. ఈ క్రమంలో సంతోషరావును రాజ్యసభ సభ్యుడిని కూడా చేశారు. అయితే ఇటీవల రెండో విడతలో ఆయనకు పొడిగింపు దక్కలేదు. తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీకాగా రెండు కాంగ్రెస్ కు దక్కాయి. బీఆర్‌ఎస్ బలానికి ఒక్క సీటు దక్కే అవకాశం ఉన్నా జోగినిపల్లి సంతోష్ కు కాకుండా దాన్ని వద్దిరాజు రవిచంద్రకు కేటాయించారు. దీంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ అలిగారని అంటున్నారు.
గతంలో కేశవరావులాంటి వారికి రెండుసార్లు రాజ్యసభ పదవిని ఇచ్చి తనను ఒక్కసారికే పరిమితం చేయడంపై ఆయన చిన్నబుచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక కేసీఆర్ గారాల తనయ కల్వకుంట్ల కవితపై గట్టి సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉన్న పదేళ్లు అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టలేదు. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా విగ్రహాన్ని పెట్టాలని ఏనాడూ కవిత కోరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తుండటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా మీ నాన్న ఉన్నప్పుడు ఈ విషయాన్ని అడగకుండా గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా అని నిలదీస్తున్నారు. మరోవైపు మద్యం కుంభకోణంలో ఈడీ కేసులు ఉండటంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తన తండ్రిని గట్టిగా కోరుతున్నారని తెలుస్తోంది.
ఇక హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంలో అంతా కేటీఆర్ చక్రం తిప్పడంతో హరీశ్ ఆటలో అరటిపండులా మిగిలిపోయారనే అభిప్రాయాలున్నాయి. పదేళ్ల అధికారంలో దాదాపు ఆయనను సిద్ధిపేట నియోజకవర్గానికే కేసీఆర్ పరిమితం చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలకు కాస్తో కూస్తో ప్రతి సమాధానం ఇస్తోంది.. హరీశే. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విమర్శలను హరీశ్ తిప్పికొట్టలేకపోతున్నారు. అందులోనూ ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖలను స్వయంగా హరీశే చూశారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కాగ్ నివేదిక వెలువరించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో పొత్తు కావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.